బ్రహ్మానందం…తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన మేటి హాస్యనటుడు. అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య స్టార్ కమెడియన్ గా చాలాకాలం ఓ వెలుగు వెలిగిన బ్రహ్మానందం…ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించారు. అడపాదడపా…కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అటువంటి బ్రహ్మానందం…రంగ మార్తాండలో సీరియస్ క్యారెక్టర్ చేసిన తర్వాత తాజాగా బ్రో చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బ్రహ్మానందం…పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.
పవన్ కల్యాణ్ పై గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హాయ్ బ్రో…ఐ లవ్ యూ బ్రో…ఐ లవ్ యూ…అంటూ బ్రహ్మి అన్న మాటలకు పవన్ తో సహా శిల్ప కలా వేదికపై ఉన్న వారంతా పగలబడి నవ్వారు. పవన్ కు 18 – 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి తాను చూస్తున్నానని, పవన్ గురించి మాట్లాడగలిగిన అతి కొద్ది మందిలో తాను ఒకడినని చెప్పారు. ఈ సినిమాలో చిన్న పాత్రలో పవన్ తో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పారు. పత్తికాయ విచ్చుకున్నంత స్వచ్ఛంగా పవన్ నవ్వు, మనసు తెల్లగా ఉంటాయిని కితాబిచ్చారు.
పవన్ లో అన్ని వైపులా మంచితనమే కనిపిస్తోందని, ఆయన ఒక దైవాంశ సంభూతుడని ఆకాశానికెత్తేశారు. పవన్ విజయానికి అన్ని విధాలుగా తోడ్పడాలని అభిమానులను కోరారు బ్రహ్మి. ఈ నాలుగు మాటలు చెప్పడం కోసమే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అన్నివిధాలా పవన్ కు తోడ్పడాలని బ్రహ్మి చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాలలో కూడా పవన్ కు ఫ్యాన్స్ మద్దతునివ్వాలని పవన్ అభిమానులను బ్రహ్మి కోరినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.