ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టు వీడడం లేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం.. హుటాహుటిన గురువారం తిరుపతికి చేరుకున్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిం చారు. ఈ క్రమంలో ఆయన ఘటనపై స్పందిస్తూ.. ప్రభుత్వం పక్షాన భక్తులకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఊహించని పరిణామంతో ప్రభుత్వం పరువు పోయిందని వ్యాఖ్యానించారు.
దీనికి టీటీడీ ఈవో, జేఈవో, పాలకమండలి చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని గురువారం రాత్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్ర టీటీడీ పాలక మండలి అత్యవసరంగా భేటీ అయింది. బాదితుల ఇళ్లకు వెళ్లేందుకు పాలక మండలి సభ్యులు సైతం రెడీ అయ్యారు. అయితే.. క్షమాపణలు చెప్పే విషయంపై మాత్రం ఈవో జె. శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరిలు స్పష్టత ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ మరోసారి ప్రస్తావించారు.
తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జెఈవో వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు… అందరూ క్షమాపణ చెప్పితీరాలన్నారు. అంతేకాదు.. “నాకు లేని నామోషీ మీకెందుకు?“ అని తీవ్రస్వరంతోనే ప్రశ్నించారు. ప్రజలంతా తిరుపతి ఘటనను తీవ్రంగా భావిస్తున్నార ని.. వారంతా ఏం చేస్తారా? అని చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పితీరాలని ఆయన పట్టుబట్టారు. “జరిగిన ఘటనకు వారికి బాధ్యతలేదని తప్పించుకుంటే ఎలా?“ అని ప్రశ్నించారు.
క్షమాపణలు చెప్పే విషయంపై పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టత ఇచ్చారు. అందరికన్నా ముందే తాను ప్రజల కు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పానన్నారు. ఘటన జరిగిన కొద్ది సమయంలోనే తాను వీడియో రిలీజ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను క్షమాపణలు చెప్పిన విషయం స్పష్టంగా ఉందన్నారు. తమ తప్పు లేకున్నా సరే టీటీడీ పాలక మండలి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మిగతా సభ్యులు, అధికారులు క్షమాపణలు చెబుతారా లేదా అన్నది వారి ఇష్టం అని చెప్పారు.
అంతకుముందు బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని బీఆర్ నాయుడు చేసిన డిమాండ్ పై స్పందించబోనని బీఆర్ నాయుడు అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను పవన్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లనుద్దేశించి అలా మాట్లాడానని స్పష్టతనిచ్చారు.