ఈ గురువారమే భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సల్మాన్ ఖాన్ రాధె సినిమా.
ఇండియాలో చాలా వరకు థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని జీ ఓటీటీతో పాటు డీటీహెచ్ ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు.
ఓ వర్గం పీఆర్వోలు, మీడియా ‘రాధె’ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చి, దాన్ని లేపే ప్రయత్నం చేసింది కానీ.. వాస్తవానికి ఇదొక పేలవమైన సినిమా అని చూసిన మెజారిటీ ప్రేక్షకులు తీర్పిచ్చారు.
సోషల్ మీడియాలో నెగెటివ్ ఫీడ్ బ్యాకే ఇచ్చింది. కొన్ని రివ్యూల్లో కూడా ఈ సినిమాను ఏకిపడేశారు.
థియేటర్లలో రిలీజైతే ఈ సినిమా డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు.
ఓటీటీల్లో మాత్రం తొలి రోజు సల్మాన్ అభిమానులు పెద్ద ఎత్తునే డబ్బులు కట్టి సినిమా చూశారు. ఐతే రెండో రోజు ఆ జోరు కనిపించడం లేదు.
పైగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం గట్టిగానే జరుగుతోంది.
#BoycottRadhe అనే హ్యాష్ ట్యాగ్ శుక్రవారం ఉదయం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
ఇలా పనిగట్టుకుని ఎవరు రాధె సినిమా గురించి ప్రతికూల ప్రచారం చేస్తున్నారని ఆశ్చర్యం కలగొచ్చు. ఇందులో మెజారిటీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కావడం విశేషం.
సుశాంత్ గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడ్డం తెలిసిందే.
స్వశక్తితో ఎదిగిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటానికి నెపోటిజం బ్యాచ్‌ను సపోర్ట్ చేసే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లే కారణమని.. ఈ కేసు విచారణలో వాస్తవాలు బయటపడకుండా సల్మాన్ అడ్డు పడ్డాడని గతంలో సుశాంత్ అభిమానులు ఆరోపించడం తెలిసిందే.
వాళ్లే ఇప్పుడు ప్రధానంగా #BoycottRadhe హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
అలాగే సల్మాన్ ఖాన్ మీద బలమైన కేసులున్నప్పటికీ అతను స్వేచ్ఛగా బయట తిరుగుతుండటం.. ఎప్పుడూ ముస్లింలకు అనుకూలంగా ఉంటూ హిందువుల సమస్యలపై, వారిపై జరిగే దాడులపై ఎప్పుడూ నోరు విప్పకపోవడం లాంటి కారణాలతో అతణ్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా ఈ ట్రెండ్‌లో కీలకంగా ఉన్నారు.
పనిలో పనిగా వీళ్లంతా ఐఎండీబీలో ‘రాధె’ సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చి దాని ఓవరాల్ రేటింగ్‌ను దెబ్బ తీయడానికి కూడా పూనుకుంటుండటం విశేషం.