‘పుష్ప’ సినిమా విడుదల ముంగిట పెద్ద షాకిచ్చే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ కావడం చిత్ర బృందానికి ఇబ్బందికరంగా మారింది. ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఒక రాష్ట్ర సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం మొదలుపెట్టారు. ఇలా చేసింది కర్ణాటక వాసులు కావడం గమనార్హం.
‘పుష్ఫ’ కన్నడలో సైతం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బేసిగ్గానే తెలుగు సినిమాలు బాగా ఆడతాయి. ‘పుష్ప’ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. కన్నడిగులే అయిన రష్మిక, ధనంజయ ఇందులో కీలక పాత్రలు పోషించడం.. బన్నీకి కూడా కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉండటంతో కన్నడ వెర్షన్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని కారణాలతో కన్నడిగులు ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు.
కర్ణాటకలో తెలుగు సినిమాల ఆధిపత్యం పట్ల ఓ వర్గం కన్నడిగుల్లో ముందు నుంచి వ్యతిరేకత ఉంది. అనువాద చిత్రాలు, పరభాషా చిత్రాలు కన్నడ సినిమాలను చంపేస్తున్నాయన్నది వారి ఆరోపణ. కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో తెలుగు సినిమాల ఆధిపత్యం వారికి ఎప్పుడూ కంటగింపే. దీనికి తోడు ‘పుష్ఫ’ మీద వ్యతిరేకతకు రష్మిక ఒక ప్రధాన కారణం.
కన్నడ సినిమాల ద్వారా పేరు సంపాదించి.. ఆ తర్వాత టాలీవుడ్‌కు వచ్చేసిన రష్మిక ఇక్కడి సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ కన్నడ చిత్రాలను చిన్న చూపు చూస్తోందన్న అభిప్రాయం వారిలో ఉంది. దీనికి తోడు ‘పుష్ఫ’ సినిమా కన్నడ వెర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పకపోవడం వారికి అభ్యంతరకరంగా మారింది.
ఓ కన్నడ అమ్మాయి కష్టపడి తెలుగులో డబ్బింగ్ చెప్పి సొంత భాషలో గొంతు ఇవ్వకపోవడాన్ని కన్నడిగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే విషయాన్ని ‘పుష్ఫ’ కన్నడ ప్రెస్ మీట్లో విలేకరులు కూడా అడిగారు. దానికి ఆమె సారీ చెప్పి టైం లేక చెప్పలేకపోయానని, పుష్ప-2లో కచ్చితంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటానని అంది. అయినా కన్నడిగులు శాంతించినట్లు లేరు.
మొత్తంగా రకరకాల కారణాలు తోడై ‘పుష్ప’ను కర్ణాటకలో బాయ్ కాట్ చేయాలంటూ విడుదలకు ముందు రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఇందుకు తగ్గట్లే ‘పుష్ప’ కన్నడ వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేవు. ‘పుష్ప’ అన్ని వెర్షన్లలో వీక్ బుకింగ్స్ ఉన్నది దీనికే.