ప్రజా ప్రతినిధులు….అంటే ప్రజలకు ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. ఆ ఉద్దేశ్యంతోనే ప్రజలు వారికి ఓట్లు వేసి తమ ప్రతినిధిగా అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తుంటారు. అయితే, ఓటు వేయకముందు ఓటు మల్లన్న ….ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది నేటి ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఇక, ఏపీలోని వైసీపీ నేతల ప్రవర్తన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓటర్ల సంగతి పక్కనబెడితే…ప్రభుత్వాన్ని నమ్ముకొని రకరకాల పనులు చేసి బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ నేపథ్యంలోనే 8 నెలలుగా తన బిల్లు పెండింగ్ ఉందని గోడు చెప్పుకునేందకు వెళ్లిక కాంట్రాక్టర్ పై మంత్రి బొత్స దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బొత్స మాట్లాడుతుండగా బొబ్బిలి పట్టణానికి చెందిన జగదీశ్వరరావు అనే క్యాటరింగ్ నిర్వాహకుడు సభావేదిక దగ్గరకు వచ్చి బొత్సకు అర్జీ అందజేశారు. గతంలో కొవిడ్ కేర్ సెంటరులో భోజన సదుపాయం కల్పించానని, దానికి సంబంధించిన ఏడున్నర లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విన్నవించారు. 8 నెలలైనా బిల్లులు రాలేదని వాపోయారు.
అయితే, అనూహ్యంగా జగదీశ్వరరావుపై బొత్స విరుచుకుపడ్డారు. ‘‘టీవీల్లో కనిపించేందుకు హడావిడి చేస్తున్నావు. అసలు భోజనం పెట్టావో? లేదో? దానికి నీ దగ్గర గ్యారంటీ ఉందా? భోజనం పెట్టలేదని నేను అంటున్నాను. పక్కకు వెళ్లు’’ అంటూ చీదరించుకోవడంతో జగదీశ్వరరావు చిన్నబోయారు. అంతేకాదు, కోట్ల రూపాయలు వెచ్చించి వేలాది ఎకరాలకు సాగునీరందించే మంచి పథకానికి జరిపే శంకుస్థాపన కార్యక్రమాలు కొన్ని టీవీల్లో కనిపించవంటూ కొన్ని మీడియా సంస్థలనుద్దేశించి తన అసహనాన్ని కూడా బొత్స వెళ్లగక్కారు. ఇక, అలాంటి టీవీలు, పేపర్లు అవసరమా? అంటూ వాటిపై విషం చిమ్మారు. కాగా, తనకు రావాల్సిన బిల్లు గురించి మంత్రికి చెబితే న్యాయం జరుగుతుందని భావించానని, కానీ, ఇలా చీదరించుకుంటారనుకోలేదని జగదీశ్వరరావు వాపోయారు.