తప్పులు చేయటం.. వాటిని సమర్థించుకోవటం కోసం వాదనలు వినిపించటం రాజకీయ నేతల్లో తరచూ కనిపించే గుణం. అయితే.. ఏ సందర్భంలో నోరు విప్పాలి? మరే సందర్భంలో మౌనంగా ఉండాలన్నది ఆయా నేతల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్ మెంట్).. లేఔట్లలో 5 శాతం భూమిని కేటాయించాలన్న ఆదేశాలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది.
ఇలాంటి వాటిపై సమర్థించేలా మాట్లాడటం అంత తేలిక కాదు. అనూహ్యంగా ఫిక్స్ చేసిన ఈ రెండు పథకాలకు బాధ్యత వహించాల్సిన శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అది కూడా హైదరాబాద్ లో.
అప్పుడెప్పుడు వైఎస్ జమానాలో మాట్లాడిన ఆ రెండు పత్రికలన్న మాటల్ని మళ్లీ ఇప్పుడు ప్రస్తావిస్తున్న బొత్స.. తాము తీసుకున్న తాజా నిర్ణయాలపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న సందేశాల్ని చూడట్లేదా? అన్న సందేహం రాక మానదు. వైఎస్ జమానా నాటికి.. ఇప్పటికి మీడియాలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు.
గతంలో ఆ రెండు పత్రికలు అంటూ.. బ్రాండింగ్ చేసే విషయంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. నిజానికి అప్పట్లో ఆ రెండు పత్రికలే ఉండేవి. కానీ.. ఇప్పుడు ఎవరికి ఏ మీడియా సంస్థ అనుకూలంగా పని చేస్తుంది.. ప్రతికూలంగా పని చేస్తుందన్న విషయం మీద జనాలకు పిచ్చ క్లారిటీ ఉందన్న విషయాన్ని బొత్స సత్తిబాబు మర్చిపోకూడదు.
అంతేనా.. తాము తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో కథనాలు రావడానికి ముందే సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకత ఆధారంగానే ఆ రెండు పత్రికల్లో కథనాలు వచ్చాయంటున్నారు. ఒకవైపు విషయాలు ఇలా ఉన్న వేళ.. తాము తీసుకొచ్చిన రెండు ఆదేశాలను సమర్థించుకోవటంలో ఆయన పడిన పాట్లు అన్ని ఇన్ని కావన్న మాట వినిపిస్తోంది.
తాజాగా తాము తీసుకొచ్చిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బొత్స.. లే అవుట్లలో 5 శాతం భూమి లేదంటే అందుకు సమానమైన స్థలాల్ని ఇతర ప్రత్యామ్నాయాలతో భూ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే పెడర్థాలు తీస్తున్నారన్న బొత్స మాటలు అతికినట్లుగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పేదలపై చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. లే ఔట్లను వేసే వారు.. తాము వేసిన లేఔట్లలో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వటానికి పేదలకు లింకేమిటి? ఆ మాటకు వస్తే.. ఈ నిర్ణయం వ్యాపారం చేసే వాడికి మాత్రమే కాదు.. సదరు లేఔట్లో కొనే ప్రతి ఒక్కరి మీదా భారమే కదా?
ఇలా భారం పడే ఆదేశాల్ని వ్యతిరేకించటం కూడా పేదలకు నష్టం చేయటమే అవుతుందా? పేదల పేరుతో తమను విమర్శిస్తున్న వారికి పంచ్ వేయాలన్న బొత్స ప్లానింగ్ సరిగా వర్కువుట్ కాలేదంటున్నారు. అంతేకాదు.. గత సర్కారు నిర్వాకాలను పెను ఆర్థిక భారాన్ని భరించాల్సి వచ్చినా సీఎం జగన్ నిబ్బరంగా పేదలకు మేలు చేసేలా పాలన చేస్తున్నట్లుగా చెప్పారు బొత్స.
ఆయన మాటలు విన్నంతనే.. గడిచిన రెండున్నరేళ్లలో జగన్ సర్కారు తీసుకొచ్చిన రికార్డు స్థాయి అప్పు లెక్క కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. బొత్స మాటలు అతకటం తర్వాత.. అతిగా అనిపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. తాము తీసుకొచ్చిన రెండు ఆదేశాలపై వస్తున్న వ్యతిరేకతను ఊహించనట్లుగా బొత్స ఫస్ట్రేషన్ ఉందన్న మాట వినిపిస్తోంది.