అమరావతిపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్య చేశారు. అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 7,300 ఎకరాలు భూమే మిగిలిందని, ఆ భూములు అమ్మితే లక్ష కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయా? అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని బొత్స అన్నారు. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తామని చెప్పారు.
అయితే, అమరావతి, మూడు రాజధానులపై అసెంబ్లీలో జగన్ చేసిన కామెంట్లపై చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అని జగన్ ప్రతిపక్ష నేతగా ఒప్పుకున్నారని, ఇపుడు కాదంటున్నారని చంద్రబాబు అన్నారు. అందుకే, ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదని.జగన్ మోసపు రెడ్డి అని చంద్రబాబు చురకలంటించారు. దీంతో, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా బొత్స అమరావతిపై తాజాగా పై వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, అమరావతిపై ప్రభుత్వం చెబుతున్న దానికి….చేస్తున్న పనులకు పొంతన లేదు. ఆల్రెడీ హైకోర్టు తీర్పుతో అమరావతి నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. అమరావతిలో ఇప్పటికే మూడొంతుల నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, 2022 నవంబరు నాటికి వాటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆ నిర్మాణ పనులకు సంబంధించిన తుది విడత రుణం కోసం కన్సార్షియంకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రూ. 200 కోట్ల రుణం ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. దీంతో, ఇప్పటికే అందిన రూ. 95 కోట్ల నుంచి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నారు. మిగిలిన రూ. 105 కోట్లు కూడా త్వరలోనే అందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆ నిర్మాణాలతోపాటు 65 శాతం పూర్తయిన టైప్ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.