వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ల మద్య ట్వీట్ వార్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా ఈ ఇద్దరి మధ్య ‘బండ్ల’ బూతులు నడవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరి బ్లేడ్ ఛాలెంజ్ అంటూ నానా హంగామా చేసి సైలెంట్ అయిన బండ్ల గణేష్…హఠాత్తుగా విజయసాయిపై విమర్శలతో మరోసారి పొలిటికల్ సర్కిళ్లలో తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.
ఎన్నడూ వైసీపీ నేతల జోలికి వెళ్లని బండ్ల గణేష్ హఠాత్తుగా సాయిరెడ్డిని టార్గెట్ చేయడం ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, విజయసాయి రెడ్డి ప్రవర్తనలో హఠాత్తుగా వచ్చిన మార్పులు కూడా ఏమీ లేవు. మూడేళ్లుగా కమ్మ సామాజిక వర్గంపై సాయిరెడ్డి ఏ రకంగా ఏడుస్తున్నారో..ఇపుడు కూడా అలాగే ఉన్నారు. ఈ క్రమంలోనే విజయసాయిపై బండ్ల తుఫాన్ విరుచుకుపడడానికి కారణం మంత్రి బొత్స సత్యనారాయణ అన్న పుకార్లు విశాఖ రాజకీయాల్లో షికార్లు చేస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో విజయసాయి హవా సాగిస్తుండడం ఉత్తరాంధ్ర సీనియర్ నేత అయిన సత్తిబాబుకు బొత్తిగా నచ్చలేదట. ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా బొత్స-విజయసాయిల మధ్య సంబంధాలు గొప్పగా లేవు. ఈ క్రమంలోనే తన మంత్రిత్వ శాఖ మారడం, ప్రాధాన్యత లేని శాఖ దొరకడం వంటి వ్యవహారాలకు విజయసాయిరెడ్డే కారణమని బొత్స ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స ఫీలవడాన్ని జీర్ణించుకోలేని ఆయన ప్రాణ స్నేహితుడు బండ్ల గణేష్ హఠాత్తుగా సాయిరెడ్డిపై ట్వీట్ వార్ డిక్లేర్ చేశారని తెలుస్తోంది.
బొత్స, బండ్లల మధ్య స్నేహం గురించి చాలామందికి తెలీదు. కానీ, హైదరాబాద్ వస్తే బొత్స తోనే బండ్ల గణేష్ ఉంటారు. ఈ క్రమంలోనే తన మిత్రుడికి విజయసాయి వల్ల అన్యాయం జరుగిందన్న ఆలోచనతో బండ్ల బూతులతో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. అయితే, బండ్ల బూతుల వెనుక తానున్నానన్న విషయాన్ని బొత్స తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు, ఇలాంటి వార్తలు వచ్చినందుకు సత్తిబాబు హర్ట్ అయ్యారట. అసలు ,తన ట్వీట్ లకు బొత్సకు సంబంధం లేదని బండ్ల కూడా అంటున్నారు.
ఏది ఏమైనా…బొత్సకు శాఖ కేటాయింపు పర్యవసానంతోనే విజయసాయిపై బండ్ల వార్ మొదలుబెట్టారని జగన్ కు తెలిస్తే మాత్రం బొత్సకు ఇక్కట్లు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా తిరుగుబాటులు, బెదిరింపులు, ఎదురుదాడులు సహించని జగన్…విజయసాయి విషయంలో ఈ తరహా పరిణామాలను అస్సలు ఎంకరేజ్ చేయకపోవచ్చు.