ఇంతకు మించిన యాదృచ్చికం ఇంకేం ఉంటుంది చెప్పండి. ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకే రోజున వేర్వేరు వేదికలపై.. భిన్నమైన రీతిలో చెరో మంత్రిపై విరుచుకుపడిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూలో భాగంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పై విరుచుకుపడితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఓపెన్ గా హోం మంత్రి అనితపై మండిపడ్డారు. ఆ మాటకు వస్తే.. తానే హోం మంత్రిని కావాల్సి వస్తుందన్న ఘాటు వ్యాఖ్యను చేయటం ద్వారా కొత్త సంచలనానికి తెర తీశారు.
వీరిద్దరు ఆయా మంత్రులపై.. వారి పని తీరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కాకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత పార్టీకి చెందిన మంత్రిపై మండిపడితే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన మిత్రపక్ష పార్టీకి చెందిన మంత్రిపై నిప్పులు చెరిగారు. కూటమిలో భాగంగా మిత్రపక్షానికి చెందిన మంత్రి పని తీరు బాగోపోతే.. ముఖ్యమంత్రికి నేరుగా చెప్పొచ్చు కానీ.. ఇలా ఓపెన్ గా అందరి ముందు ఇలా మాట్లాడితే ఏం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు.. పవన్ చేసిన వ్యాఖ్యలతో కూటమి బంధంపై కొత్త చర్చ మొదలైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆచితూచి అన్నట్లు మాట్లాడారే తప్పించి.. పవన్ తీరును తప్పు పడుతూ మాట్లాడేందుకు కించిత్ ధైర్యం చేయకపోవటం కనిపిస్తోంది. ఇక.. సీఎం.. డిప్యూటీ సీఎంలు ఇద్దరు మంత్రుల తీరును ప్రశ్నించటం.. వారి పని తీరు ఏ మాత్రం బాగోలేదనన బహిరంగ వ్యాఖ్యల పరంపర చూసినప్పుడు.. పని తీరు బాగోని మంత్రులకు మంగళం పాడనున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల వేళ.. ఓట్ల నమోదు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తూ.. గణాంకాలతో సహా మంత్రి వాసంశెట్టి సుభాష్ తీరును తప్పు పట్టారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన సహచర హోం మంత్రి అనిత పని తీరును ప్రశ్నించారు. ఇలా అయితే.. తాను హోం మంత్రిని కావాల్సి ఉంటుందన్న విషయాన్ని చెప్పేయటం సంచలనంగా మారింది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఒకే రోజున ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ క్లాసులు పీకటం మాత్రం ఆసక్తికరంగా మారింది. దీన్ని యాదృచ్చికం అనాలా? ఇంకేమైనా అనాలా?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.