‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’ ఆన్ లైన్ సమావేశంలో శనివారం మధ్యాహ్నం బోంబే ఐఐటి విద్యార్ధులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బైటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొన్న తీరుతెన్నులను బట్టే రాబోయే రోజుల్లో వివిధ దేశాలు ముందంజ వేస్తాయి.
ఎవరైతే కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నారో వారికి నష్టాలు తగ్గాయి, ఎదుర్కోలేనివాళ్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు.
కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు పెరిగాయి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు,మానసిక శారీరక ఇబ్బందులు పడ్డారు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మా వంతు బాధ్యతగా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దోహదం చేశాం.
కరోనాపై తొలిరోజునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. జనవరిలోనే అప్రమత్తం చేశాను. కరోనా విజృంభిస్తే సమాజానికి వాటిల్లే కష్టనష్టాలను వివరించాం. డిజిటల్ వర్కింగ్ ను ప్రోత్సహించాం, మాస్క్ విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలను చైతన్యపరిచాం.
మా తరం దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పుట్టినవాళ్లం. మీ యువతరం ఆర్ధిక సంస్కరణల ముందు, తర్వాత పుట్టినవాళ్లు.
1991లో టైమ్స్ మ్యాగజైన్ లో ‘‘ప్రపంచ ఆర్ధిక సవాళ్లను భారతదేశం ఎదుర్కోగలదా’’ అనే వ్యాసం మమ్మల్నెంతో అసంతృప్తికి గురిచేసింది. దానినొక సవాల్ గా తీసుకునేలా చేసింది.
ఆర్ధిక సంస్కరణలకు ముందు మనదేశంలో ఏకపార్టీ పాలన ఉండేది. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల పాలన వచ్చింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ దిగుమతులకు కూడా ఆర్ధిక కటకట. బంగారం కూడా కుదవబెట్టిన పరిస్థితులు. ఆ స్థితినుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరాం, భవిష్యత్తులో ప్రపంచంలోనే తొలిరెండు స్థానాల్లో భారతదేశం చేరనుంది.
1991లో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటనే కొందరి సందేహాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా చేసిన కృషి వివరించారు.
హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది.
సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్రప్రదేశ్ నుంచే, గూగల్ సిఈవో ఇండియా నుంచే, అనేక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మనదేశం నుంచే కావడం విశేషం.
హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, దేశానికే 4% జిడిపి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి.
రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల ఏపికి ఆర్ధిక కష్టాలు..రాజధాని లేదు, బస్సులోనుంచే పరిపాలన.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధించాం, జాతీయ వృద్దిరేటు 7.3% ఉంటే దానికన్నా మూడు నాలుగు రెట్లు ముందున్నాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించాం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 17% వృద్ది సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4ఏళ్లు నెంబర్ వన్ గా నిలబడ్డాం. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టాం, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా ఏపికి తెచ్చాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించాం.
గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి.
గతంలో ‘‘ప్రి రిఫామ్స్, పోస్ట్ రిఫామ్స్’’ గా అభివృద్ది చరిత్ర రాసినట్లే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్’’ గా అభివృద్ది చరిత్ర తిరగరాసే పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ తెచ్చిన మార్పులను అందిపుచ్చుకోవాలి.
మన విజన్ ఎప్పుడూ దూరదృష్టితో ఉండాలి. మరో 30ఏళ్ల ముందు ఆలోచనలు చేయాలి. 30ఏళ్ల తర్వాత నువ్వెలా ఉంటావు, దేశం ఎలా ఉంటుంది, మన విజన్ ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వేం చేయాలి, దేశానికేం ఇవ్వాలి, సమాజానికేం ఇవ్వాలి అనేదానిపై మన ఆలోచనలు, కార్యాచరణ ఉండాలి.
మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది.
మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి..
ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4.0లో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. దీనికంటె ముందు 4 పారిశ్రామిక విప్లవాల వృద్ది పరిణామ క్రమం చూడాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి.
పర్యావరణ హిత వాతావరణం, ఆటోమోటెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ది నేపథ్యంలో కాలుష్య రహిత సమాజం కోసం మీరంతా దృష్టి పెట్టాలి.
4.0పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత, టూల్స్ వినియోగం అందిపుచ్చుకోవాలి.
ఇంటర్నెట్ రాకముందు అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం పంపాలంటే 3, 4రోజులు పట్టేది. ఫోన్ లో మాట్లాడాలంటే వందల రూపాయల ఖర్చయ్యేది. అలాంటిది ఇంటర్నెట్ అభివృద్ది చెందాక ప్రపంచమే గ్లోబల్ విలేజిగా మారింది.
గతంలో ఉపాధ్యాయులనుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లం. ఇప్పుడు అధ్యాపకులకే పాఠాలు చెప్పే పరిస్థితిలో విద్యార్ధులు ఉన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి
గతంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా ఉండే వర్గీకరణ ఇప్పుడు ఐటి లిటరేట్, ఐటి ఇల్లిటరేట్ గా మారింది.
ఒకప్పుడు రూ 14 ఉండే సోలార్ పవర్ యూనిట్ తర్వాత రూ 7కు, ఇప్పుడు రూ 2.50కు వచ్చింది. భవిష్యత్తులో సోలార్ పవర్ యూనిట్ రూపాయి, రూపాయిన్నరకే వచ్చే అవకాశం. ప్రకృతే సహజ ఇంధన ఉత్పాదన వనరు..
సమాజంలో ఏవిధంగా వినూత్న మార్పులు వస్తున్నాయో ఇవే ప్రబల సాక్ష్యాలు.
జలవిద్యుత్ సీజనల్ కాబట్టి, థర్మల్ పవర్ తప్ప మార్గాంతరం లేదని గతంలో భావించారు. ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులు వచ్చాక థర్మల్ పవర్ తెరమరుగు అవుతోంది.
పర్యావరణహితంగా సమాజంలో వచ్చే మార్పులను స్వాగతించాలి, అనుసరించాలి.
ప్రతి రైతు ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదకుడిగా మారే పరిస్థితి.. వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ సెట్ నుంచి తమ పంటలకు కరెంటు పొందడమే కాకుండా గ్రిడ్ కు కూడా అమ్మే పరిస్థితి. ఉచిత విద్యుత్ తాను పొందడమే కాకుండా ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా రాబడి రైతు పొందే స్థితి. ఇకపై విద్యుత్ సరఫరా, పంపిణీ(టిఅండ్ డి) నష్టాలకు కాలం చెల్లే పరిస్థితి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు కరెంటు ద్వారా నడిపే పరిస్థితి.
విశాఖ విషయం చూడండి. ప్రి- హుద్ హుద్, పోస్ట్- హుద్ హుద్ గా విశాఖ అభివృద్ది ముఖచిత్రం మారిపోయింది. హుద్ హుద్ సృష్టించిన బీభత్సం తెలిసిందే. విపత్తులను మనం ఆపలేం గాని, మానవ ప్రయత్నంతో విపత్తు నష్టాలను తగ్గించగలం. 8రోజులు విశాఖలోనే మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ కు ధీటుగా సైబరాబాద్ నిర్మాణం చేశాం.
హైదరాబాద్ లో 30ఇంజనీరింగ్ కళాశాలలను 300 చేశాం. ఇంజనీరింగ్ కాగానే వాళ్ల ఉపాధిపై దృష్టి పెట్టాం. అందుకే ఐటి అభివృద్దికి నాందిపలికాం. నాతో సమావేశానికి నిరాకరించిన బిల్ గేట్స్ 40నిముషాలు నాతో చర్చలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ బేస్ పెట్టాలనేది తప్ప మరొకటి కోరలేదు. ఇప్పుడదే మైక్రోసాఫ్ట్ కు సిఈవో ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు కావడం విశేషం.
హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మించాలన్న ఆలోచన రాగానే, దేశవిదేశాల్లో 20ఎయిర్ పోర్టులు పరిశీలించాం, 20నమూనాలు రూపొందించాం. ఆ తర్వాతే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం.
అదే స్ఫూర్తితో అమరావతి అభివృద్దికి శ్రీకారం చుట్టాం. గ్యాస్, పవర్, ఫోన్, కేబుల్ కు ఐసిటి డక్ట్స్..సీవరేజ్ వాటర్ అండర్ గ్రవుండ్ పైపులైన్లతో రాజధాని నగర నిర్మాణానికి నాంది పలికాం.
నదుల అనుసందానం కల నిజం చేశాం. కృష్ణా గోదావరి నదుల అనుసందానం చేశాం. గోదావరి పెన్నా అనుసందానికి నాంది పలికాం. పంచనదుల అనుసందానమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాం. రసాయన ఎరువులు లేని సేంద్రియ పంట ఉత్పత్తుల వైపు రైతులను మళ్లించాం.
సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పాదన వల్ల మన జీవన ఆయుర్దాయం మరింత మెరుగవుతుంది.
సమాజంలో వచ్చే మార్పులకు మీరే చోదకుల్లాగా ఉండాలి. అందుకు తగిన నాయకత్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.
ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి, కార్యాచరణ అనేది అతి ముఖ్యం..
‘‘2050నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పుకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది’’ ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి.
ఓటమి భయం ఉండకూడదు. రిస్క్ లను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు.
ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరికరాల వినియోగంపై పట్టు సాధించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి, దానిని ప్రోత్సహించాలి, పోటీతత్వంతో, నైపుణ్యాభివృద్దితో ముందడుగు వేయాలి.
సరైన విజన్ ఉన్నప్పుడే మన లక్ష్యసాధన, దిశానిర్దేశం ఉంటుంది. మన జీవితానికి దిక్సూచి, లక్ష్య సాధన ద్వారా మన కలల సాఫల్యానికి శక్తి మన విజన్.
మన కలలు నెరవేర్చే విజన్ ఉండాలి, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అద్భుత నాయకుడిగా ఎదగగలరు.
తద్వారా మీ సాధికారతతోపాటు దేశ సాధికారత సాధ్యమయ్యేలా ఉభయతారకంగా మీ అందరి ఎదుగుదల ఉండాలి.
మీ ఎదుగుదల కోసం ఒక విజన్ రూపొందించుకోండి. మెగా మైండ్ సెట్ ద్వారా దానిని చేరుకోండి. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయండి, స్థూలంగా కార్యాచరణ చేయండి. అప్పుడే మీరు మీమీ రంగాల్లో అద్భుత నాయకుల్లాగా ఎదుగుతారు.
2050 వైపు మీ ప్రయాణంలో ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే, ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని…
ఇరవై ముప్పై ఇళ్లు ఉండే కుగ్రామంలో నేను పుట్టాను. రోడ్డు, కరెంటు వసతులు లేని పల్లె నుంచి నేను వచ్చా. మనం ఎక్కడనుంచి వచ్చినా, ఏ స్థాయికి చేరామన్నది మన కృషిని ప్రతిబింబిస్తుంది.
సామాన్యుడైన అబ్దుల్ కలామ్ అసామాన్యుడిగా ఎదిగారు, దేశానికే స్ఫూర్తిదాయకుడు అయ్యారంటే అదే..
నాకే అన్నీ తెలుసు అనుకోరాదు. ప్రతి రోజూ నేను నేర్చుకుంటున్నా అనే భావంతో ముందుకెళ్లాలి.
పంపు సెట్ దగ్గరకు రైతు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటినుండే రైతు ఆపరేట్ చేసే స్థితి..
రాబోయే కాలంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, పరికరాలు, ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే మన సామర్ధ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటాయి.
డబ్బులేదనే చింత ఉండకూడదు. విజ్ఞానమే ధనం కన్నా మిన్న..100ఎకరాల భూమి ఇచ్చినా బిడ్డ అసమర్ధుడైతే నిలబెట్టుకోలేడు. అదే బిడ్డ విజ్ఞానవంతుడిని చేస్తే అతనికన్నా ధనికుడు ఉండరు.
ఏ కష్టానికి భయపడరాదు. సంక్షోభాన్ని అధిగమించడంలోనే సామర్ధ్యం. మీ అందరినీ ఉజ్వల భవిష్యత్తులో చూడాలన్నదే నా ఆకాంక్ష.
మీ వ్యక్తిత్వం, మీ ఉద్యోగం, మీ విజ్ఞానం మీ ఎదుగుదలకే కాదు, సమాజాభివృద్దికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.
యువ జనాభా అధికంగా ఉండటం, సాంకేతికతను అందిపుచ్చుకునే పరిజ్ఞానం పుష్కలంగా ఉండటం, గణితం, ఆంగ్లంలో అభినివేశం భారతదేశానికి ఎనలేని సానుకూలతలు..
పోస్ట్ కోవిడ్ సానుకూలతలను భారతదేశం సద్వినియోగం చేసుకుంటుంది.
ఏ రంగంలోనైనా నాయకులకు దీర్ఘదృష్టి ఉండాలి. భవిష్యత్ లో వచ్చే మార్పులను ఊహించగలగాలి. రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలపై ఆలోచనలు చేయాలి.
స్ఫూర్తిదాయక సమయంలో మనం ఉన్నాం. అభివృద్దే మనందరికి స్ఫూర్తి.
తమ ప్రతిభా ఉత్పత్తులలో యువతరం మంచిపేరు పొందాలి. మన గొప్ప వారసత్వ సంపద నిలబెట్టాలని’’ చంద్రబాబు ఆకాంక్షించారు.
వెబినార్ లో విద్యార్ధుల పలు ప్రశ్నలకు చంద్రబాబు జవాబిచ్చారు. ‘‘ సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్(అసత్య వార్తలు, తప్పుడు కథనాలు) పెరగడం ఆందోళనకరం. వాస్తవిక అభివృద్దిని ఇవి కొద్దికాలమే కనుమరుగు చేయవచ్చు. కానీ అభివృద్దిని ఎవరూ దాచిపెట్టలేరని’’ అన్నారు.
ప్రశ్నించిన విద్యార్ధి మురళి చింతమనేని స్వగ్రామం వాయల్పాడు నీటి కొరత గురించి చంద్రబాబు గుర్తు చేశారు.
‘‘అనంతపురంలో నీటి సమస్య గురించి కియా వాళ్లు ప్రస్తావించారు. నీళ్లు ఇచ్చాకే ఫ్యాక్టరీ పెట్టమన్నాను..కొద్దిరోజుల్లోనే గండికోట నుంచి నీళ్లిచ్చి చూపించాం, ఆ తర్వాతే కియా నెలకొల్పారు. ఇప్పుడు కియా కార్లు రోడ్లపై తిరుగుతుంటే ఆ సంతృప్తి వేరని’’ చంద్రబాబు పేర్కొన్నారు.