టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ గత ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించి ఈ ఏడాది విశాఖపట్నంలో పూర్తి చేసిన యువగళం పాదయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరీ ఈ యాత్రను ఆయన పూర్తి చేశారు. రాష్ట్రంలో వైసీపీని అధికారం నుంచి దించేయాలన్న సంకల్పంతో యువనేత చేసిన ఈ పాదయాత్రకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. పోలీసుల అడ్డంకులను సైతం అధిగమించి ఈ యాత్రనుపూర్తి చేశారు.
ఇక, ఇప్పుడు యువగళం పాదయాత్రలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. ప్రజల నుంచి వచ్చిన ఆదరాభిమానాలు వంటివి వాటికి అక్షర రూపం ఇస్తూ.. యువగళం పాదయాత్రపై `శకారంభం` పేరుతో పుస్తకాన్ని రూపొందించారు. సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన “శకారంభం” పుస్తకాన్ని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని నారా లోకేష్ ఆవిష్కరిస్తూ.. రచించిన పెమ్మరాజును అభినందించారు.
పుస్తకంలో ఏముందంటే..
కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద 2023 జనవరి 27న ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చివరి రోజు యాత్ర ముగిసే వరకు ఈ పుస్తకంలో అన్ని విషయాలను పేర్కొన్నారు. 230 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226రోజులపాటు కొనసాగిన యాత్ర విశేషాలను వివరించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకూ యువగళం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభంలో పేర్కొన్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ… ప్రజాచైతన్యమే లక్ష్యంగా జైత్రయాత్రలా సాగిన యువగళం రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. చారిత్రాత్మక పాదయాత్రకు అక్షరరూపమిచ్చిన మిత్రుడు కృష్ణకిషోర్ అభినందనీయులని తెలిపారు. కాగా, కీలకమైన ఎన్నికల వేళ..ఈ పుస్తకాన్ని దాదాపు ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా.. ప్రజల్లో చైతన్యం కలిగించి.. మార్పు దిశగా వారిని నడిపించాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.