భార్యభర్తలుగా కొంతకాలం కలిసి బతికి.. ఆ తర్వాత విడాకులతో విడిపోయిన వారికి సంబంధించిన వివాదాలెన్నో చూస్తుంటాం. ఇది కాస్త భిన్నమైనది. సాధారణంగా భరణం కోసం మహిళలు కోర్టును ఆశ్రయించటం.. వారికి అనుకూలంగా న్యాయస్థానాలు స్పందించటం చూస్తున్నదే. తాజా ఉదంతంలో మాత్రం అందుకు భిన్నంగా చోటు చేసుకుంది. విడాకులు తీసుకొని విడిపోయిన మాజీ భర్తకు భరణం చెల్లించాలంటూ మాజీ భార్యకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన ఉదంతమిది.
అనారోగ్యం కారణంగా తనకు సంపాదన లేదని.. తన మాజీ భార్య జాబ్ చేస్తున్న నేపథ్యంలో భరణాన్ని కోరుతూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం.. వైద్యపరమైన ఇబ్బందులతో సదరు వ్యక్తి జీవనోపాధి పొందే స్థితిలో లేదన్న విషయాన్ని కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి సివిల్ కోర్టు మాజీ భర్తకు భరణం ఇవ్వాలని పేర్కొనగా.. దీన్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును మాజీ భార్య ఆశ్రయించారు.
ఈ ఉదంతంలో ఇరు వర్గాల వాదనలు విన్న బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఇలాంటి పరిస్థితులు ఉన్న వారికి ఆదాయ వనరు ఉన్న జీవిత భాగస్వామి మధ్యంతర భరణం చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న మహిళ.. తన మాజీ భర్తకు నెలకు రూ.10 వేలు చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. అంతకు ముందు సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటం గమనార్హం.