ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమ గెలుపు ఖాయమని భావిస్తూ.. దాదాపు 27 ఏళ్లుగా ఎదురు చూసిన కమల నాథులకు ఢిల్లీ పీఠం ఎట్టకేలకు దక్కనుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన పది నిమిషాల సమయం నుంచే బీజేపీ నేతలు.. ట్రెండింగ్‌లో నిలిచారు. ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 45 స్థానాల్లో బీజేపీ ఘన విజయం దక్కించుకునే దిశగా అడుగులు వడివడిగా వేస్తుండడం గమనార్హం.
ఇది హస్తినలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడో సారి విజయం దక్కించుకుని కూటమి సర్కారును ఏర్పాటు చేసుకు న్న ప్రధాని మోడీకి ఈ ఎన్నిక అత్యంత ప్రధానంగా మారింది. “దేశంలో పట్టున్నా.. దేశ రాజధానిలో మాత్రం పట్టు నిలుపుకోలేకపోతున్నాం. ఇది సరికాదు. ఈ సారి మన జెండా ఎగరాల్సిందే“ అని .. ఆరు మాసాలకు ముందు ప్రధాని చెప్పిన మాట ఇప్పుడు నిజం అవుతోంది.
బలమైన పేదల పార్టీగా, మాస్ జనాలకు అత్యంత చేరువగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢీకొట్టడం అంటే.. మాటలు కాదన్న విశ్లేషకుల అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. బీజేపీ నేతలు.. ఢిల్లీ పీఠాన్ని దక్కిం చుకునే క్రమంలో చేసిన వ్యూహం.. వేసిన అడుగులు కూడా.. సక్సెస్ దిశగా సాగుతున్నాయి. ఇది.. పూర్తిగా బీజేపీ విజయం అనాల్సిందే. ఎక్కడా పొరపొచ్చాలు లేని నాయకత్వం.. ఇతర పార్టీలపై చేసిన రాజకీయ యుద్ధంలో అలుపెరుగని వ్యూహాలను పాటించిన వైనం ఈ విజయాన్ని చేరువ చేశాయి.
దీంతో 27 ఏళ్ల కిందట ఉల్లిపాయలు, బంగాళ దుంపల ధరల ప్రభావానికి వాడిపోయిన కమలం… ఇప్పుడు మరోసారి సంపూర్ణ మెజారిటీతో మరింత ఎక్కువ సీట్లలో వికసిస్తుండడం గమనార్హం. నిజానికి ఇప్పుడు న్న పరిస్థితిలో బీజేపీకి ఈ విజయం మరింత బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కేంద్రంలో పొత్తు పెట్టుకున్న దరిమిలా.. బీజేపీ గ్రాఫ్ తగ్గుతోందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తమ పట్టు నిలుపుకొనేందుకు.. కమల వికాసం కొనసాగుతోందని చెప్పడానికి ఢిల్లీ మరో కేరాఫ్‌గా మారింది.