తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది. అయితే.. తొలిసారి, మూడో సారి కంటే కూడా.. ఈ దఫా ఆచితూచి వ్యవహరించినట్టు కనిపించింది. ఈ దశలో మొత్తం 12 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితాను ప్రకటించింది. అయితే.. తాజా జాబితాలో తుల ఉమకు వేములవాడ టికెట్ కేటాయించడం పార్టీలో ఆసక్తిగా మారింది. వాస్తవానికి ప్రస్తుత హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి టికెట్ ఆశించినా.. ఆమెకు నిరాశే ఎదురైంది.
ఈ క్రమంలో తాజాగా తుల ఉమకు టికెట్ రావడం గమనార్హం. ఇక, జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఎవరినీ నిలబెట్టక పోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో సుభాష్ రెడ్డి చేరారు. ఆయనకు కూడా టికెట్ కేటాయించారు.
ఎవరెవరు ఎక్కడ నుంచి..?
బీజేపీ ప్రకటించిన 4వ జాబితాలో మునుగోడు-చలమల కృష్ణారెడ్డి, వేములవాడ – తులా ఉమ, చెన్నూరు – దుర్గం అశోక్, కొడంగల్ – బంటు రమేష్, గద్వాల్ – బోయ శివ, ఎల్లారెడ్డి – సుభాష్ రెడ్డి, హుస్నాబాద్ – శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట – శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ – నవీన్ కుమార్, మిర్యాలగూడ – సాధినేని శ్రీనివాస్, నకిరేకల్ – మొగులయ్య, ములుగు – అజ్మీర ప్రహ్లాద్ నాయక్ ఉన్నారు. అయితే.. వీరిలో ఒకరిద్దరు తప్ప.. గట్టి పోటీ ఇచ్చే నాయకులు కనిపించకపోవడం గమనార్హం. కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం ఆచి తూచి వీరిని ఎంపిక చేసింది.