బీజేపీతో జట్టుకట్టడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదని టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగా భావిస్తున్నాయి. తమ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ-అమితషాల ఉచ్చులో పడ్డారేమోనని అంతర్గతంగా అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తే.. అవన్నీ వైసీపీకి అయాచితంగా ఇచ్చినట్లే అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మోదీ-షా సీఎం జగన్‌కే వత్తాసు పలుకుతున్నారని.. ఆయన, ఆయన సర్కారు విచ్చలవిడి అవినీతిలో కూరుకుపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
సీబీఐ, ఈడీ కేసులు ఉన్నందున రాష్ట్రం కోసం ఏమీ అడగని జగన్ అంటే వారికి వల్లమాలిన అభిమానమని.. పార్లమెంటులో బేషరతుగా తమకు మద్దతివ్వడమే దీనికి కారణమని.. అందుకే అడగ్గానే అప్పులు ఇప్పిస్తున్నారని.. లక్షల కోట్ల ఆదాయం దారి మళ్లుతున్నా కిమ్మనడం లేదని టీడీపీ ద్వితీయ శ్రేణులు బీజేపీ నాయకత్వంపై మొదటి నుంచీ గుర్రుగా ఉన్నారు. పైగా చిలకలూరిపేట సమీపాన బొప్పూడిలో మార్చి 17న మూడు పార్టీలూ ఉమ్మడిగా నిర్వహించిన సభలో బాబు, పవన్.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడితే మోదీ మాటమాత్రంగానైనా అవినీతి సర్కారును నిలదీయలేదని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏ సాయమూ చేయకపోవడం, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకపోవడం.. రాజధానిని జగన్ నాశనం చేస్తుంటే దన్నుగా నిలవడం.. కొత్త రాష్ట్రం రుణగ్రస్థమవుతున్నా.. హెచ్చరించకపోవడం వంటి చర్యలు ప్రజల్లో బీజేపీపైనా తీవ్ర వ్యతిరేకత పెంచాయని.. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే వారు ఎలా హర్షిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడిప్పుడే టీడీపీ వైపు మళ్లుతున్న మైనారిటీలు మళ్లీ వైసీపీకే ఓటేస్తారని.. ముఖ్యంగా ముస్లింలు టీడీపీ, జనసేనకు దూరమవుతారని హెచ్చరిస్తున్నారు. అయితే వారి భయాందోళనలను చంద్రబాబు, పవన్ తోసిపుచ్చారు. రాష్ట్ర హితం కోసమే పొత్తుపెట్టుకున్నామని చంద్రబాబు టీడీపీ నేతలతో భేటీలో స్పష్టం చేశారు. రేపు కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం సాయం అవసరమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే మూడు పార్టీలూ చేతులు కలిపాయని పవన్ కూడా తమ నేతలతో అన్నారు. ఇంకోవైపు.. పొత్తులో భాగంగా ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలో టీడీపీ, జనసేన, బీజేపీ తుది నిర్ణయానికి వచ్చాయి.
ఎక్కువ ఎంపీ సీట్ల కోసం..
మార్చి 11న ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి బీజేపీ దూతలు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత, మాజీ ఎంపీ వైజయంత పాండా, జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చారు. సుమారు 8 గంటలు చర్చలు జరిపారు. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను బీజేపీ కోరింది. అయితే బాబు బీజేపీకి ఐదు లోక్‌సభ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇస్తానన్నారు. బలాబలాల ప్రాతిపదికనే ఇది చెబుతున్నానని అన్నారు. బీజేపీ ఆశిస్తున్న స్థానాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, సమీకరణలను వారికి వివరించారు. గెలుపు అవకాశాలున్న స్థానాలనే ఇస్తున్నామని.. వాటినే తీసుకోవాలంటూ కొన్ని సర్వేలను కూడా వారి ముందు పెట్టారు. విజయవాడ, విశాఖపట్నం ఎంపీ స్థానాలను షెకావత కోరగా.. బాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
విజయవాడ తమ సిటింగ్ స్థానమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆ సీటు కూడా ఇవ్వలేమన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన సుజనాచౌదరి విజయవాడ కోసం, వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టుగా పేరొందిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోసం విశాఖను అడిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరికి టికెట్లు ఇచ్చే పరిస్థితే లేదని బాబు తేల్చేసినట్లు బీజేపీ వర్గాలే తెలిపాయి. అలాగే అతిపెద్ద జాతీయ పార్టీ అయిన తమకు కనీసం పది అసెంబ్లీ స్థానాలైనా ఇవ్వాలని షెకావత, పాండా బేరాలాడారు. బాబు అంగీకరించకపోవడంతో పవన్ తమ వాటాగా వచ్చిన 3 లోక్‌సభ స్థానాల్లో ఒకటి, అసెంబ్లీస్థానాలు మూడు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో బాబు కూడా ఒక అసెంబ్లీ స్థానం అదనంగా ఇచ్చేందుకు అంగీకరించారు. కుదిరిన పొత్తు ప్రకారం.. టీడీపీ 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. ఇక… బీజేపీ ఆరు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
ప్రతి ఓటు, ప్రతి సీటూ ముఖ్యమే
పొత్తులో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ సీట్లు కేటాయించినప్పుడు టీడీపీ శ్రేణులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. జనసేన నుంచి ఓట్ల బదిలీ జరుగుతుందని అవి విశ్వసించాయి. కానీ గత ఎన్నికల్లో బీజేపీ నేతలు, శ్రేణులు వైసీపీ విజయానికి పాటుపడ్డారని.. టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేశారని.. ఇది ప్రజలందరికీ తెలుసని.. అలాంటి పార్టీతో మనం ఎందుకు అంటకాగాలని నిలదీయడం మొదలుపెట్టాయి. ఏకంగా ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇది జనసేన శ్రేణులకూ వ్యాపించడంతో కమలనాథులు కలవరపడ్డారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత స్థాయుల్లో వివిధ బాధ్యతల్లో ఉన్న 56 వేల మంది నేతలతో మార్చి 12న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘రివర్స్ పాలన, దుష్ట పాలనతో నష్టపోయిన రాష్ట్రం కోసం.. బాధ్యతతో కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పొత్తు ఆంధ్రకు లాభం చేకూరుస్తుంది. పోలవరం పూర్తి చేయడానికి.. రాజధాని నిర్మాణానికి.. పెట్టుబడులు, పరిశ్రమలు రాబట్టడానికి… మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర సాయం ఎంతో అవసరం’ అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని.. విభేదాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ… ప్రతి సీటూ ముఖ్యమేనని.. కనీసం 160 అసెంబ్లీ సీట్లు సాధించాలని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీల గెలుపు చారిత్రక అవసరమన్నారు. ‘జగన్ విధ్వంస పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. ప్రతి రంగంలో పతనమే. దోచుకుని జేబులు నింపుకోవడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఏపీని మళ్లీ పైకి లేపడానికే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి’ అని ఉద్ఘాటించారు.
ఢిల్లీలో ఉన్నప్పుడే బుజ్జగింపులు..
వాస్తవానికి పొత్తు కుదుర్చుకోవడానికి అమితషా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చించడానికి బాబు, పవన్ మార్చి 8నే ఢిల్లీ వెళ్లారు. కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు మూడు పార్టీల అధ్యక్షులు మర్నాడు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఓపక్క బాబు పొత్తు చర్చల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ.. విరామ సమయంలో బీజేపీతో స్నేహాన్ని వ్యతిరేకిస్తున్న, పొత్తుతో సీట్లు కోల్పోయే నాయకులకు అక్కడి నుంచే ఫోన్లు చేసి బుజ్జగించారు. 19 నియోజకవర్గాల నేతలతో ఆయన మాట్లాడి సముదాయించారు. అధికారంలోకి వచ్చాక వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వీరిలో చాలా మంది సమాధానపడినా.. కొందరు మాత్రం స్వతంత్రంగా బరిలోకి దిగే దిశగా అడుగులు వేస్తున్నారు. సీనియర్ నేతలు వారిని బుజ్జగించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.