ఏపీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తాను ప్రయత్నిస్తానని చెప్పగా ఆ క్రమంలోనే బిజెపి అగ్ర నేత అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భేటీ అయ్యారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై అధికారికంగా ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీ కలిసి వస్తే మిగతా సీట్లలో కొన్ని కేటాయిస్తామని చెబుతూ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని సంకేతాలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన బిజెపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఏపీకి చోటు దక్కకపోవడంతో టీడీపీతో బీజేపీ పొత్తు పక్కా అని టాక్ వస్తుంది. 195 మంది అభ్యర్థుల పేర్లను బిజెపి ప్రకటించగా అందులో తెలంగాణకు 9 దక్కాయి. కానీ, ఏపీ నుంచి ఒక్క అభ్యర్థికి కూడా టికెట్ కేటాయించలేదు. దీంతో, టీడీపీ జనసేన బీజేపీ కలిసి టికెట్ల గురించి, పొత్తుల గురించి మాట్లాడుకున్న తర్వాతే ఏపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఇక, చంద్రబాబు కూడా రెండో జాబితా విడుదల చేయడానికి ముందే బిజెపితో పొత్తు కుదిరితే వారికి కేటాయించే సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు వ్యవహారంపై దాదాపుగా బీజేపీ ఒక క్లారిటీ ఇచ్చేసినట్లేనని టీడీపీ జనసేన నేతలు ,కార్యకర్తలు భావిస్తున్నారు.