టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్న వ్యవహారంపై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకాం వేశారు. బీజేపీ పెద్దలు అమిత్ షా తో పాటు పలువురు కీలక నేతలతో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైందని మీడియా, సోషల్ మీడియాలో లీకులు వస్తున్నాయి. పొత్తుల వ్యవహారం ఆల్రెడీ ఓ కొలిక్కి వచ్చిందని, సీట్ల పంపకం గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇక, ఏపీలో 6 నుంచి ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీ అడుగుతోందని, 13 అసెంబ్లీ సీట్లు కావాలని కోరుతోందని ప్రచారం జరుగుతుంది. అయితే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని, రేపు ఉదయానికి ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రేపు శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ పొత్తుపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
లేదంటే ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం ఏపీ బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తుపై అధికారికంగా చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు అనధికారికంగా ఖాయమైందని, అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని తెలుస్తోంది.