దుబ్బాక ఉప ఎన్నిక చరిత్రను తిరగరాసింది. ఉప ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఓడిపోని టీఆర్ఎస్ నేడు దుబ్బాకలో ఓడిపోయింది. చేతిలో అధికారం ఉండి, పోలీసు వ్యవస్థ చేతిలో ఉండి… ప్రతిపక్షాలను అడుగడుగునా అడ్డుకున్నా కూడా దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోవడం అసాధారణ ఓటమిగా జనం అందరూ చెబుతున్నారు.
రఘునందన్ రావు చేతిలో ఓడిపోయింది సోలిపేట సుజాత కాదు, కేసీఆర్ ఓడిపోయారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ మట్టికొట్టుకుపోయి దుబ్బాక టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఈ ఓటమి టీఆర్ఎస్ కలలో కూడా ఊహించలేదు.
సరిగ్గా రెండేళ్ల క్రితం 62000 మెజారిటీ వచ్చిన దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అసాధారణ విషయం. కేవలం రెండేళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే ఇవి బీజేపీపై ప్రేమతో వేసిన ఓట్లు కాదు. టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడానికి పడిన ఓట్లు. అంటే కేసీఆర్ కనుక మేల్కొని మారకపోతే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తేలిపోయింది.
విచిత్రం ఏంటంటే… ఉప ఎన్నికలో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ సంతోషానికి కూడా కారణమైంది. తాము గెలవకపోయినా టీఆర్ఎస్ గెలవకపోతే చాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. అదే జరిగింది.