ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గతంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మొదలు కేంద్ర హోం శాఖ పెద్దల వరకు అందరూ స్పష్టం చేశారు. అంతేకాదు, రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనూ ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని, రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని గతంలోనే స్పష్టం చేసింది. దీంతో, అమరావతి రాజధానిపై కేంద్ర స్థాయిలోనూ బీజేపీ స్టాండ్ ఏమిటన్నది చాలాకాలం కిందటే స్పష్టమైంది. అయితే, ఇదంతా గతం. ఇటీవల కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ తో అమరావతి రాజధానిపై కేంద్రం తన వైఖరి మార్చుకుందని స్పష్టమైంది.
అమరావతి కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని ఏపీ బీజేపీ నేతలకు షా క్లాస్ పీకడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక, తాజాగా అమరావతి రాజధాని అంశంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనే అని, రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ స్టాండ్ అని సోము చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అమిత్ షా క్లాస్ తర్వాత సోము ఈ మాట ఎందుకన్నారు అన్న చర్చ జరుగుతోంది.
అంతేకాదు, అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందని, ఈ నెల 21న రైతుల మహా పాదయాత్రలో ప్రత్యక్షంగా తాము పాల్గొంటున్నామని సోము చెప్పడం వెనుక షా క్లాస్ పని చేసిందని చెబుతున్నారు. ఏది ఏమైనా…అమరావతి రాజధానికి కేంద్రం మద్దతు లభించే అవకాశాలున్నాయనే విధంగా సోము వ్యాఖ్యలుండడం శుభపరిణామమని అమరావతి రైతులు అభిప్రాయపడుతున్నారు.