ఎన్ని నిందలు వేసినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎంత అవమానించినా… ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నడుస్తున్న అమరావతి ఉద్యమంపై ఇన్నాళ్లకు బీజేపీకి విశ్వాసం కలిగినట్టుంది. అమరావతి పై ప్రజల్లో సానుకూలత ఉందని మెల్లగా బీజేపీ అర్థం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఆ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి.
ఇంతకాలం రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోదంటూ కేంద్రం అమరావతి అంశంపై చేతులెత్తేసింది. అయితే తాజాగా యుటర్న్ తీసుకుంది. అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రధాని మోడీ మనిషిగా తాను ఈ మాట చెబుతున్నానని… ఏపీకి అమరావతే రాజధాని అని వ్యాఖ్యానించారు.
జగన్ బాటలో నడిస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని బీజేపీకి అర్థమైనట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని చక్కని అవకాశం ఏపీకి దక్కింది. అత్యంత ఆధునికంగా కొత్తగా రాజధానిని నిర్మించుకునే ప్రణాళిక వేసి గత ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తే జగన్ సీఎం అయ్యాక దానిపై నీళ్లు చల్లారు. కేవలం తన పార్టీ ప్రయోజనాల దృష్టా రాజధానిని రాజకీయం చేశారని ఏపీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అమరావతిపై జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరికి, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వైఖరికి తేడా ఉండడంతో ప్రజలు కన్ ఫ్యూజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మోడీ మనిషిగా తాను చెబుతున్నా అంటూ సోము బల్లగుద్ది చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చా అని ఆలోచిస్తే తిరుపతి ఎన్నిక ముందు ఇదొక డ్రామా కూడా అయ్యుండొచ్చని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికపై కన్నేసిన బీజేపీ దానికోసం బాగా ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 4 ఎంపీలు గెలిసినపుడు అదే ట్రిక్ తో ఏపీలో తిరుపతి సీటును గెలవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. తిరుపతి సీటును దక్కించుకోవడం ద్వారా తాము బలపడుతున్నాం అన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు.