తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
మంగళవారం నాడు నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ తేల్చి చెప్పారు. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి అవకాశం ఇస్తానని, వారిని మార్చే ప్రసక్తే లేదని కూడా కేసీఆర్ వెల్లడించారు. పాత వారందరికీ ఎవరి నియోజకవర్గాల్లో వారికే సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని ఐటి, ఈడి, సీబీఐ దాడులతో విరుచుకుపడుతున్న బిజెపిపై టిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బిజెపితో ఇక యుద్ధమేనని కేసీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా కేసీఆర్ చర్చించారు. బిజెపి నేతలు స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలని అడిగారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీజేపీకి సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ అనుకూలంగానే ఉంటోందని, అయినప్పటికీ వైసీపీని ఇరుకునపడేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇంతకంటే ఘోరం ఇంకోత ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందని, వాటిని ఎదుర్కొని తిప్పికొట్టే దిశగా నేతలంతా సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు.