తాజాగా పరిణామాలు.. మంచికైనా.. చెడుకైనా.. ఒక సంచలన ఘటన మాత్రం తెరమీదకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం.. కుప్పంలో అడుగు పెట్టారు. అయితే.. ఆయన ను నిలువరించేందుకు వైసీపీ నాయకుల డైరెక్షన్లో కార్యకర్తలు.. శ్రేణులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో రాళ్లదాడికి కూడా దిగారు. అదేసమయంలో .. చంద్రబాబు కాన్వాయ్పైనా.. రాళ్ల దాడి చేశారు. ఈ పరిణామాలు తీవ్ర కల్లోలం రేపాయి. అయితే.. ఇక్కడే చంద్రబాబుకు ఒక మంచి కూడా జరిగింది.
జరిగిన పరిణామాలను చంద్రబాబు కేంద్రం హోం శాఖకు ఫోన్లో చెప్పారు. తనపైనా.. తన కాన్వయ్పైనా.. జరిగిన దాడిని పూసగుచ్చినట్టు వివరించారు. దీంతో కేంద్ర హోం శాఖ.. హుటాహుటిన స్పందించింది. చంద్రబాబుకు భద్రతగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్జ్స్కు కాల్చివేత.. అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. హైదరాబాద్లో ఉన్న ఎన్ ఎస్జీ డీఐజీని ఏపీకి పంపించింది. చంద్రబాబు సహా ..టీడీపీ ప్రధాన కార్యాలయం ఉన్న మంగళగిరిలో ఆయన సందర్శించేలా ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై ఈగవాలకుండా చూసుకునేలా.. రాష్ట్రపోలీసులకు కూడా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చా యి. ఈ పరిణామాలతో.. టీడీపీలో ఉత్సాహం కనిపిస్తోంది.
అయితే.. వాస్తవానికి.. గతంలో టీడీపీ ఆపీస్పై వైసీపీ శ్రేణులు దాడులు చేసినప్పుడు.. చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తానే స్వయంగా.. ఢిల్లీ వెళ్లారు. అయితే.. అప్పట్లో చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. కనీసం.. హోం మంత్రి కానీ.. ప్రధాని కానీ.. ఊళ్లోనే ఉండి కూడా చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఆ పరిణామాలు మారిపోయాయి. కేంద్రం నుంచి చంద్రబాబుకు.. టీడీపీకి సంపూర్ణ సహకారం ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. దీనికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు.. రాబోయే రోజుల్లో ఎన్నికల వరకు సాగినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక, ఇదే జరిగితే… చంద్రబాబుకు తిరుగులేదని.. ఆయనను ఎవరూ ఆపలేరని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.