ఏపీలో సీఎం జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీని అప్పులకుప్పగా మార్చిన జగన్…మరోవైపు సంక్షేమ పథకాల అమలు పేరుతో ఖజానాను ఖాళీ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, తన నవరత్నాల అమలు కోసం జనాలపై జగన్ పన్నులు ఇబ్బంది పెడుతున్నారని, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు జరిపిన రహస్య సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 62 శాతం మంది ప్రజలు…జగన్ సర్కార్ పై అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేశారట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద, జగన్ పనితీరు మీద, ప్రభుత్వ పథకాల మీద బీజేపీ అధిష్టానం ఒక సమగ్ర సర్వే జరిపినట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలకు చెందిన 4 లక్షల 58వేల మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారని తెలుస్తోంది.
ప్రభుత్వ పనితీరు, నవరత్నాల ప్రభావం, ప్రతిపక్షం పాత్ర, వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, తదితర అంశాలపై ఈ సర్వే నిర్వహించారని తెలుస్తోంది.
ఈ సర్వేలో నవరత్నాల వల్ల కలుగుతున్న ప్రయోజనాల కన్నా పెరిగిన పెట్రో,డీజిల్, నిత్యావసరాల ధరలు తమ నడ్డి విరుస్తున్నాయని, కరోనా వల్ల పనులు దొరక్క, ఉపాధి లేక కుటుంబ ఆదాయం తగ్గిపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారట. దీంతో, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని…ఏపీలో బలోపేతం కావడానికి ఇదే మంచి సమయమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.