ఆయన పేరు స్వరూపానందస్వామి. విశాఖ శారదాపీఠం ఆయన నివాసం. ఆధ్యాత్మిక ప్రచారం.. హిందూ ధర్మ ప్రచారం ఆయన ఉద్యోగం. అయితే.. ఆయన హాబీ మాత్రం రాజకీయాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల దగ్గర మంచి జోరున్న స్వామిగా ఆయన గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆధ్యాత్మికత పరంగా ఏం చేయాలో అన్నీ చేశారు(ఆయనే చెప్పుకొన్నారు). దీంతో ఆయనను విశాఖ వాసులు సహా పొలిటికల్ లీడర్లు.. స్వరూపానంద స్వామి.. బదులు `జగన్ స్వామి` అని పిలుస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఆ స్వామి ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. వరుసగా వస్తున్న కీలక నేతల ఫోన్లకు సమాధానం చెప్పలేక పోతున్నారట!
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలపై వరుస దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండే.. త్రిదండి చినజీయర్ స్వామి(ఏపీలో ఆశ్రమాలు ఉన్నాయనుకోండి) హుటాహుటిన ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఘాటుగానే స్పందించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలోని రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహానికి తలనరికేసిన అత్యంత సంచలనాత్మక విషయంపై స్పందించడంతోపాటు.. అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చారు.
ఇంత జరిగినా.. పొరుగు రాష్ట్రాల స్వాములు కూడా స్పందించినా.. పక్క జిల్లాలో(విజయనగరానికి పక్కనే విశాఖ జిల్లా) ఉండే స్వరూపానంద మాత్రం కిక్కురు మనలేదు. ఆలయాలపైదాడులు సహా రామతీర్థం ఘటనపై పెదవి విప్పలేదు. ఈ విషయం రాజకీయంగా ఆసక్తిని రేపింది.
సీఎం జగన్‌తో అత్యంత చనువున్న స్వామి.. నిత్యం జపతపాలు చేసే స్వరూపానంద.. రాష్ట్రంలో దేవాలయ ధర్మానికి ఇంత విఘాతం కలుగుతున్నా.. మౌనం పాటించడం ఏంటనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అయినా.. ఆయన స్పందించలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే విషయాలపై స్వామికి కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అనే ప్రశ్నలు బీజేపీ సీనియర్ నేతలు సహా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్(స్వరూపానందతో పరిచయం ఉంది. రుషికేష్‌లో ఇరువురు అనేక మార్లు చర్చలు జరిపారు) వంటివారు వరుస ఫోన్లతో స్వామిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట.
ప్రభుత్వ విషయాన్ని పక్కన పెట్టండి.. ఆధ్యాత్మికంగా మీరు స్పందించాలి స్వామీ.. అని భగవత్ విన్నవించారట. ఇప్పుడు ఎలా స్పందించాలి? ఎటు వైపు మొగ్గాలి? అనే విషయాలపై విశాఖ శారదా పీఠం తర్జన భర్జన పడుతున్నట్టు.. తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.