బీజేపీ చీఫ్ సోము వీర్రాజును తప్పించబోతున్నారా ? పార్టీలో మొదలైన పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. పార్టీలో సీనియర్ నేతల్లోఒకరైన సన్యాసిరాజు రాసిన లేఖ పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సన్యాసిరాజు రాసిన లేఖలో వీర్రాజు ప్లేసులో అధ్యక్షునిగా తనను నియమించాలని కోరటమే ఆశ్చర్యంగా ఉంది.
ప్రస్తుత అధ్యక్షుడిని మార్చేట్లయితే ఆ స్ధానంలో నియామకానికి తన పేరును సానుకూలంగా పరిశీలించాలని రాజు స్పష్టంగా రిక్వెస్టు చేసుకున్నారు. గతంలో తాను రాష్ట్ర కోశాధికారిగాను, విజయనగరం జిల్లా అధ్యక్షునిగా పనిచేసినట్లు కూడా చెప్పారు. నడ్డాకు సన్యాసిరాజు రాసిన లేఖపైనే పార్టీలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే వీర్రాజుపై పార్టీలోని కొందరు సీనియర్ నేతల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది.
వీర్రాజు పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఏకపక్షంగా వెళుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తనకు బాగా సన్నిహితులైన నలుగురైదుగురిని మాత్రమే బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నపుడు ఒకలాంటి ఆరోపణలు పెరిగిపోయాయి. అందుకనే ఆయన్ను తప్పించి వీర్రాజును పార్టీ అధిష్టానం నియమించింది.
అయితే వీర్రాజు పైన కూడా ఇలాంటి ఆరోపణలు, విమర్శలే పెరిగిపోతున్నాయి. పైగా మొన్ననే జరిగిన పంచాయితి ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారనే విషయాన్ని పార్టీ ఇప్పటివరకు చెప్పలేదు. అలాగే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు ఎంతమంది అని ప్రకటించటంలో విఫలమైంది. హోలు మొత్తంమీద చూస్తే పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలం పెరగలేదని అర్ధమైపోయింది.
ఇలాంటి అనేక అంశాలపై వీర్రాజు మీద రాష్ట్రం నుండి ఫిర్యాదులు వెళుతున్నదైతే వాస్తవం. పైగా పార్టీలోకి ఇతర పార్టీల నుండి సీనియర్ నేతలను చేర్చుకోవటంలో కూడా వీర్రాజు ఫెయిలయ్యారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపు కాపు నేతలతోనే టచ్ లో ఉంటారనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. బహుశా ఈ నేపధ్యంలోనే వీర్రాజును అధ్యక్షునిగా మార్చేస్తారని సన్యాసిరాజు భావించుంటారు. అందుకనే నడ్డాకే లేఖరాశారు. ఏదేమైనా రాజు రాసిన లేఖపై పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.