బీజేపీ, జనసేన నేతలు చేపట్టిన ‘రామతీర్థం ధర్మయాత్ర’ ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. రామతీర్థానికి చేరుకుంటున్న బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనసేన, బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కిందపడిపోయారు. విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్, మంత్రుల వైఖరిని సోము తప్పుబట్టారు. రామతీర్థంలో పోలీసులు సెక్షన్30 పేరుతో సోమును, బీజేపీ కార్యకర్తను అరెస్టు చేశారు. జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించే వరకు నిద్రపోబోమని సోమువీర్రాజు శపథం చేశారు. బీజేపీ, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకుంటే రాష్ట్రం తగలబడిపోతుందని, జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం కొండ మీదకు టీడీపీ, వైసిపిని అనుమతించి బీజేపీని అడ్డుకోవడం ఏంటని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా..లేక రాష్ట్ర ప్రభుత్వమా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన, పోలీసుల దమన కాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. 60 ఏళ్ల వయసున్న సోము వీర్రాజును అరెస్ట్ చేయడం జగన్ పిరికిపంద చర్య అన్నారు. ఏపీలో పోలీసులు, ప్రభుత్వం వైపల్యం వల్లే ఈ తరహా వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.