బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి, పద్మశ్రీ కంగనా రనౌత్ పేరు ఈ మధ్యకాలంలో తరచుగా మీడియా, సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తన వివాదాస్పద వ్యాఖ్యలతో క్వీన్ రచ్చకెక్కుతోంది. భారత దేశానికి 1947లో కాదు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపాయి. ఇక, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారని కంగనా చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది.
ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌కు గాంధీ మద్దతు ఇవ్వలేదని కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దీంతో, కంగనా వైఖరిపై బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కంగనాపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందకు మహారాష్ర్ట కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఏకంగా ఈ ఫైర్ బ్రాండ్ నటిని కోర్టుకు ఈడ్చేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టులో కంగనా వ్యవహారాన్ని తేల్చుకుంటామని, అవసరమైతే అత్యన్నత న్యాయస్థానానికి వెళ్లి పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇక, కంగనా వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ సామాజిక కార్యకర్త నిఘత్ అబ్బాస్ మండిపడ్డారు. మోడీ కూడా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నారని కంగనాకు హితబోధ చేశారు. గాంధీని విమర్శించి అంతర్జాతీయంగా భారతదేశ పరువును కంగనా మంటగలుపుతోందని ఫైర్ అయ్యారు. ఈ అసంబద్ధ వ్యాఖ్యలతో కంగనా ఏం సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
ఇక, కంగనా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంగనా ప్రవర్తనకు బీజేపీ పెద్దలు ఇచ్చిన మద్దతే కారణమని దుయ్యబడుతున్నారు. దేశభక్తి అని చెప్పే బీజేపీ నేతలు కంగనా మాటలపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కంగనా వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని అవమానించేలా ఉన్నాయని అంటున్నారు.