ఏపిలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలది తెలంగాణాలో మాత్రం ఎవరి దారి వాళ్ళదేనా ? కాస్త విచిత్రంగానే ఉంది రెండు పార్టీల వ్యవహారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ చదివిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ పొరబాటున కూడా మిత్రపక్షమైన బీజేపీ పేరు ప్రస్తావించలేదు.
ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో తమదే గెలుపని, మేయర్ పీఠం తమదే అంటు కమలనాదులు ఎంత హడావుడి చేస్తున్నది అందరు చూస్తున్నదే. దెబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన ఊపుతో గ్రేటర్ ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు ఎక్కడా తగ్గటం లేదు. మరి వాళ్ళ వాస్తవ బలం ఏమిటో ఇఫ్పటికిప్పుడు తెలీదు కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే మాత్రం మేయర్ పీఠం గెలుచుకోవటం ఖాయమన్నట్లే ఉంది.
జీహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లలో 2015 ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ గెలుచుకుంది మూడంటే మూడే డివిజన్లు. మిగిలిన డివిజన్లలో చాలా వాటిల్లో మూడో ప్లేసే వచ్చింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 స్ధానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న విషయం జనాలందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు పార్లమెంటు స్ధానాల్లో గెలిచింది. దాంతో అప్పటి నుండి బీజేపీని తెలంగాణాలో పట్టడం కష్టంగానే ఉంది. దానికితోడు తాజాగా దుబ్బాకలో గెలవటంతో మరీ రెచ్చిపోతున్నారు.
సరే వీళ్ళ విషయాన్ని పక్కనపెట్టేస్తే పవన్ పేరుతో విడుదలైన ప్రెస్ నోట్ చూసిన తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు ఏపికి మాత్రమే పరిమితమా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రచారానికి రమ్మని బీజేపీ నేతలు పిలిచినా పవన్ కల్యాన్ వెళ్ళలేదు. అప్పుడే రెండు పార్టీల పొత్తుపై సందేహాలు మొదలయ్యాయి. తాజాగా జారీ అయిన ప్రెస్ రిలీజ్ చూసిన తర్వాత పొత్తులు లేవని అర్ధమవుతోంది. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకుంటారో ఏమో తెలీదు.
ఎందుకంటే రెండు పార్టీలు విడివిడిగా పోటి చేస్తే చెరో నాలుగు డివిజన్లు గెలుచుకునేది కూడా అనుమానమే. అంటే కలిసి పోటీ చేస్తే మేయర్ పీఠాన్ని గెలిచేసుకుంటాయని ప్రత్యర్ధి పార్టీలేవి భయపడటం లేదు. కాకపోతే విడిగా పోటీ చేయటం కన్నా కలిసి పోటీ చేస్తే మంచిది కదా అన్న ఆలోచన ఒకటే రెండు పార్టీలను కలపాలి. ఎందుకంటే ఎలాగూ ఏపిలో మిత్రపక్షాలే కాబట్టి. చూద్దాం ఏమి జరుగుతుందో.