- ఈ రేవు హస్తగతానికి
- గానే పథక రచన
- నాన్ మేజర్ పోర్టుగా
- నిరుడు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్
- తన బినామీ అరబిందోకు ఇవ్వడానికే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోదీ సర్కారు తేల్చేసింది. రెవెన్యూ లోటు నిధులను తెగ్గోసింది.. వెనుకబడిన జిల్లాలకు సాయం ఏనాడో ఆపేసింది.. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ఓడరేవుకు అవకాశం లేదన్నది.. ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని చూపిస్తే.. ఇప్పుడు దానికీ సాయం చేసేది లేదు పొమ్మని తెగేసిచెప్పింది.
ఈ హామీ కొండెక్కడం సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యమేనని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ రేవును తన బినామీ అరబిందో కంపెనీకి కట్టబెట్టడానికి ముందుగానే ఆయన పథక రచన చేశారు. ఇదే ఈ హామీ నుంచి వైదొలగడానికి కేంద్రానికి అవకాశమిచ్చిందని అంటున్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో కేంద్రప్రభుత్వం ప్రధాన ఓడరేవు (మేజర్ పోర్టు) ఏర్పాటు చేయాలి. అయితే నిపుణులతో అధ్యయనం చేయించి.. అక్కడ మేజర్ పోర్టు ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేవని.. కృష్ణపట్నం, ఆ పక్కనే చెన్నై పోర్టు దీనికి సమీపంలోనే ఉన్నాయని.. వేరే ప్రత్యామ్నాయం ప్రతిపాదించాలని నాటి కేంద్ర షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించింది.
దాంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకాశం జిల్లా రామాయపట్నం మేజర్ పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ప్రతిపాదించింది. ఈ హామీని నెరవేర్చాలని ఆ తర్వాత పలు సార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు.
2019లో పగ్గాలు చేపట్టిన జగన్ ప్రభుత్వం కూడా.. కొన్నాళ్లు రామాయపట్నంలోనే మేజర్ పోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వైఖరిని మార్చుకున్నారు. మేజర్ పోర్టు స్థానంలో మైనర్ (నాన్-మేజర్) పోర్టు ఏర్పాటుకు ఆయన సర్కారు నిరుడు ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ ఇచ్చింది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పోర్టు ఏర్పాటవుతుందని.. ఇందుకోసం ఒక ప్రైవేటు ఫార్మాసూటికల్ కంపెనీ (అరబిందో) ఆసక్తి చూపుతోందని.. ఇందులో రాష్ట్రప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుందని.. అవసరమైతే ఆర్థికంగానూ సహకరిస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు.
దీంతో కేంద్రం రామాయపట్నంపై తన వైఖరిని మార్చేసింది. నాన్-మేజర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేసినందున.. అక్కడ మేజర్ పోర్టు అవసరం లేదని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో చెప్పకనే చెప్పారు.
నిజానికి కేంద్రమే మేజర్‌పోర్టు మంజూరు చేస్తే.. దానికయ్యే నిధులు, నిర్మాణ భారం దానివే. అయితే జగన్ ప్రభుత్వం మైనర్ పోర్టు వైపు మొగ్గడంతో దానికి నిధులిచ్చేది లేదని తేల్చేశారు. అసలు రామాయపట్నంలోనే మేజర్ పోర్టు ఏర్పాటు చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సి ఉంటుందన్నారు.
సవరించి వద్దని ఎవరన్నారు? తమకు, తమ అనుయాయులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా ఎన్ని బిల్లులు ఆమోదించుకోలేదు? ఒక్క పార్టీ కూడా దానిని వ్యతిరేకించదు. అయినప్పటికీ అలా చేయలేదు. మైనర్ పోర్టు ఏర్పాటుకు జగన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను సాకుగా చూపుతోంది.
అదీగాక దేశంలో మేజర్ పోర్టులు మాత్రమే కేంద్రం పరిధిలోకి వస్తాయి. నాన్-మేజర్ (మైనర్) పోర్టుల బాధ్యత రాష్ట్రప్రభుత్వాలదే. వాస్తవానికి మేజర్ పోర్టు ఏర్పాటైతే రాష్ర్టానికి విస్తృత ప్రయోజనాలుంటాయి. దానికి అనుబంధ పరిశ్రమలు ఎన్నో వస్తాయి.
మౌలిక వసతుల కల్పన సమయంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఇక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుపెడితే లక్షల మంది జీవితాలు సుస్థిరమవుతాయి. ఇన్ని ప్రయోజనాలు చేకూరతాయని తెలిస్తే ఏ ప్రభుత్వమైనా కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. జగన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
ఒత్తిడి మాట అటుంచి.. మోదీ సర్కారుకు వెసులుబాటు కలిగించేలా.. మైనర్ పోర్టు స్థాయికి రామాయపట్నాన్ని ముందుగానే తగ్గించేశారు. కేవలం తన సన్నిహిత ఫార్మా కంపెనీకి పోర్టు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే.. రామాయపట్నం కోసం విభజన చట్టాన్ని సవరించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.