నిజమే… తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుత భారత రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం జరగడంతో కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీకి లెక్కలేనన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. అప్పటిదాకా బీజేపీతోనే కలిసి సాగిన ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగానే గుడ్ బై చెప్పేస్తున్నాయి. ఈ తరహా పరిణామాలతో ఇప్పటికిప్పుడు ఇబ్బందేమీ లేకున్నా… నాలుగేళ్లలో రానున్న ఎన్నికల నాటికి మాత్రం ఈ పరిణామాలు బీజేపీకి చాలా నష్టమే చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
మరేం చేయాలి? పరిస్థితిని చక్కదిద్దేదెలా? మొన్నటికి మొన్న అమిత్ షా కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరితే… ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమైపోతే… పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే దిక్కే లేకుండా పోయిన వైనం చాలా స్పష్టంగానే కనిపించింది. ఈ లోటు భర్తీ కావాలంటే… మళ్లీ వెంకయ్య యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాక తప్పదు. ఆ దిశగానే బీజేపీ అడుగులు వేస్తోందన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
గతంలో వెంకయ్య పార్టీలో కీలక నేతగా, కేంద్ర మంత్రిగా, ఎన్డీఏ కూటమిలోని మిత్రులతో ఎప్పకటిప్పుడు తలెత్తే సమస్యలను ఇట్టే పరిష్కరించేవారు. స్వపక్షాలతోనే కాకుండా విపక్షాలతోనూ తనదైన శైలిలో చర్చలు జరిపిన వెంకయ్య… కీలకమైన బిల్లుల విషయంలో మోదీకి ఇబ్బందులే ఎదురుకాకుండా చూసేవారు. అయితే ఎప్పుడైతే వెంకయ్యను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి బీజేపీ అధిష్ఠానం ఆయనను ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిందో.. అప్పటి నుంచి బీజేపీలో ట్రబుల్ షూటరన్న మాటే వినపడటం లేదు.
కేంద్రం తీసుకువస్తున్న కీలక బిల్లుల విషయంలో విపక్షాలు ఓ రేంజిలో ఫైరైపోతున్నాయి. అంతేనా… కూటమిలోని మిత్రపక్షాలు కూడా బీజేపీ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా కూటమికే గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని నాలుగు కీలక భాగస్వాములు బీజేపీకి గుడ్ బై చెప్పేశాయి. మరిన్ని పార్టీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయన్న వార్తలు బీజేపీలో పెను కలవరాన్నే రేపుతున్నాయి.
ఇలాంటి తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేదెలా? అన్న విషయంపై అప్పుడే బీజేపీలో ఓ అంతర్మథనం మొదలైపోయిందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావడం ద్వారా… ఈ తరహా సమస్యల నుంచి బయటపడవచ్చని కూడా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరి వెంకయ్యను మరోమారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న విషయంపై ఇప్పుడు బీజేపీలో పెద్ద చర్చే నడుస్తోందట. మొన్నటిదాకా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మోడీకి మంచి అండగా నిలబడ్డారు. ఇపుడు కోవిడ్ వచ్చాక అనారోగ్యం ఇప్పటికీ బాధిస్తోంది. దీంతో ఆయన మోడీకి పూర్తి అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఒక అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ అంతర్గత విషయాల వ్యూహాల వరకు సక్సెస్ అవుతున్నా… ప్రతిపక్షాల ను ఎదుర్కోవడం ఆయన ఒక్కడి శక్తి చాలడం లేదు. సకల విషయాలపై అవగాహన కలిగిన వెంకయ్య వంటి ఆరేటర్ రాజ్యాంగ పదవిలోకి వెళ్లిపోవడంతో … ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టడం చాలా కస్టమవుతోంది. అసలు ఎన్డీఏ పక్షాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న వైనం అస్సలు బీజేపీలో కనిపించడమే లేదు.
ఇదే తరహా పరిస్థితి మరింత కాలం కొనసాగితే… వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఏకాకి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎక్కడికక్కడ నివారించేసి… ఎప్పటికప్పుడు పార్టీకి కొత్త ఊపిరిలూదడంలో ఆరితేరిన వెంకయ్య రంగంలోకి దిగాల్సిందేనన్న వాదనలు ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. మరి వెంకయ్యను రీ యాక్టివేట్ చేసే దిశగా బీజేపీ ఏ తరహా వ్యూహాన్ని రచిస్తుందో చూడాలి.