ఉక్రెయిన్ పై పోరుతో రష్యాదే పైచేయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఈ యుద్దం వల్ల ఉక్రెయిన్ నష్టపోయిన దానితో పోలిస్తే రష్యానే ఎక్కు వగా నష్టపోయిందని చెప్పవచ్చు. రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. అయినాసరే రష్యా మాత్రం వెనక్కు తగ్గడం లేదు. దీంతో, ఆంక్షల తీవ్రతను పెంచే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడుగులు వేస్తున్నారు.
రష్యా ముడి చమురు, గ్యాస్ ను నిషేధిస్తున్నట్టు బైడెన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని, నిధులు అందజేస్తామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీ, సెమీకండక్టర్ల వంటి ఉత్పత్తులూ రష్యాకు అందకుండా చేస్తామని బైడెన్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. అలా చేయడం ద్వారా రష్యా సైన్యం బలహీనంగా మారుతుందని బైడెన్ హెచ్చరించారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి వైదొలిగాయని, అమెరికా స్టాక్ ఎక్స్ ఛేంజ్ లు రష్యా సెక్యూరిటీల ట్రేడింగ్ ను నిలిపేశాయని, రష్యా యుద్ధాన్ని ప్రైవేట్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.
ఆంక్షలు విధించడంలో ప్రపంచ దేశాలు అమెరికాతోపాటు నడిచాయని అన్నారు. దీంతో, రష్యా ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోయిందని, రూబుల్ విలువ 50 శాతం క్షీణించిందని, ఇప్పుడు రష్యా కరెన్సీ ఒక్క పెన్నీ కూడా విలువ చేయదని దుయ్యబట్టారు. యుద్ధం ప్రారంభించిన 10 రోజుల్లోనే రష్యాపై 2,700కు పైగా ఆంక్షలను విధించగా, అవి ప్రస్తుతం ఐదున్నర వేలకు చేరుకున్నాయి. ఉత్తర కొరియా, ఇరాన్ ల కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.
కాగా, తమపై ఆంక్షలు విధించిన దేశాలను నొప్పి తెలిసేలా చేస్తామని, తాము కూడా ఆంక్షలు విధిస్తామని రష్యా హెచ్చరించింది. రష్యా చాలా వేగంగా, కచ్చితంగా స్పందిస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అన్నారు. ఏయే దేశాలపై ఏ ఆంక్షలు విధించాలనే కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు.