ఈ నెల 25 నుంచి నిజం చెబుదాం కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు యాత్ర ప్రారంభం కానున్న తరుణంలో ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. భువనేశ్వరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో భువనేశ్వరికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా తిరుమల వెళ్లారు. ఇక, స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నారావారిపల్లెకు భువనేశ్వరి బయలుదేరారు. నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర 3 రోజుల పాటు జరగనుంది. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ప్రతి వారం 3 రోజుల పాటు ఆమె ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. రేపు చంద్రగిరిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది.