సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం పెను సంచలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం.. రిమాండ్ కు తరలించటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏ1గా మొదట పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డికి.. ఈ వ్యవహారంలో సంబంధం లేదని తేల్చిన పోలీసులు ఆయన్ను ఈ రోజు (గురువారం) విడుదల చేశారు. అదే సమయంలో ఇప్పటివరకు కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియను ఏ1గా మార్చనున్నారు.ఈ కేసులో మొదట ఏ3గా పేర్కొన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను ఏ2గా చేసినట్లుగా తెలుస్తోంది. వీరిపాటు శ్రీనివాసరావు.. చంటి.. సాయి.. ప్రకాష్ పేర్లను కూడా చేర్చారు. మియాపూర్ కు.. కొండాపూర్ కు మధ్యన ఉన్నహఫీజ్ పేటలోని సర్వే నెంబరు 80లోని 25 ఎకరాల భూమిని 2016లో బాధతులు కొనుగోలు చేశారని.. అయితే.. ఆ భూమి తమదేనని ఏవీ సుబ్బారెడ్డి.. భూమా అఖిలప్రియ వాదిస్తున్నట్లు పోలీసులు చెప్పటం తెలిసిందే.
అయితే.. సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారని.. అయితే భూమి ధర పెరగటంతో నిందితులు సమస్యలు సృష్టించారన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్నారు. కిడ్నాప్ ఉదంతంలో ఏవీ సుబ్బారెడ్డి పాత్ర లేదని గుర్తించిన పోలీసులు అతడ్ని విడుదల చేశారు. అదే సమయంలో ఏ2గా ఉన్న అఖిల ప్రియను ఏ1గా మార్చారు. అంతేకాదు.. ఇప్పటికే అఖిలప్రియపై నమోదు చేసిన సెక్షన్లకు అదనంగా ఐపీసీ సెక్షన్ 147, 385లను చేర్చి కేసులు మోపారు.ఇదిలా ఉండగా.. ఈ రోజు అఖిలప్రియకు బెయిల్ కోరుతూ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్నటివరకు ఏ2గా పేర్కొన్న పోలీసులు ఈ రోజు ఏ1గా మార్చారని.. ప్రజాప్రతినిధిగా ఉన్న అఖిలప్రియకు 41 సీఆర్పీసీ నోటీసులుకూడా ఇవ్వలేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని.. అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సికింద్రాబాద్ కోర్టు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. కేసు విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేశారు.