బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 50 ఎకరాల స్థలం వివాదానికి సంబంధించి ఈ కిడ్నాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో, ఈ కిడ్నాప్ కేసులో ఏ1గా టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డి, ఏ2గా భూమా అఖిల ప్రియ, ఏ3గా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు చేర్చారు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని అఖిల ప్రియ కోరినా…న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో, మరోసారి నేడు అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానుంది. మరోవైపు, ఈ కేసులో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏ2గా ఉన్న అఖిల ప్రియను ఏ1గా, ఏ1గా ఉన్న సుబ్బారెడ్డిని ఏ2గా పోలీసులు మార్చడం చర్చనీయాంశమైంది. దీంతో, ఈ వ్యవహారంపై అఖిల ప్రియ సోదరి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే సుబ్బారెడ్డి ఏ2గా ఎలా మారారని ఆమె ప్రశ్నించారు. తన సోదరి అఖిల ప్రియ ఆరోగ్యం బాగోలేకున్నా జైలుకు తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస సమాచారం లేకుండా 30, 40 మంది మగ పోలీసులు ఇంటికి వచ్చి తన సోదరిని తీసుకువెళ్లారని ఆరోపించారు. గత 3 నెలలుగా అఖిలప్రియ ఆరోగ్యం చాలా సెన్సిటివ్‌గా ఉందని, అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని మౌనిక తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అఖిల ప్రియ కళ్లు తిరిగి పడిపోయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల ప్రియ ఫిట్‌గా ఉందని, తీసుకెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. కాగా, బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో హఠాత్తుగా నాటకీయ పరిణామాలు జరిగాయి. రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్కసారిగా ఏ1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చడం….. ఏ2 గా ఉన్న అఖిలప్రియను ఏ1గా, ప్రధాన నిందితురాలిగా మార్చడం చర్చనీయాంశమైంది. ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్ ను చేర్చిన పోలీసులు అతడి కోసం బెంగుళూరులో గాలిస్తున్నారు. దీంతోపాటు, ఏవీ సుబ్బారెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియ రెండోసారి బెయిల్ పిటిషన్, ఏ1గా సుబ్బారెడ్డిని తొలగించడంపై మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు.