ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఏపీలో పాజిటివిటీ రేటు దాదాపు 30 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోందని, కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కూడా సూచించారు. అయినప్పటికీ, ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనాను పక్కనబెట్టి రఘురామ అరెస్టు వంటి కక్షపూరిత రాజకీయాలకు తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ పై ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్ భారతికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని షాకింగ్ కామెంట్లు చేశారు. అలా జరిగాకైనా రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితిలో కొంత మార్పు వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజల ఆర్తనాదాలను జగన్ అర్థం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జగన్ చేతకానితనంతో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు జగన్ తెలుసుకోవాలని, కనీసం ఆ ప్రాంత ఎమ్మెల్యేల దగ్గర నుంచి కరోనాపై సమాచారం తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతలను జగన్ మాట్లాడనివ్వరని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని, ‘ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి’అని ఎద్దేవా చేశారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్రాజు ప్రశ్నించారు.