దేశంలోనే అత్యున్నత పౌర సత్కారంగా పేర్కొనే భారతరత్న పురస్కారాన్ని తాజాగా ప్రకటించారు. సాధారణంగా జనవరి 26కు కాస్త ముందుగా మాత్రమే ప్రకటించే తీరుకు భిన్నంగా ఈసారి మూడు రోజుల ముందే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. దేశ ప్రజల అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఈసారి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
స్వాతంత్య్ర సమరయోధుడిగా సుపరిచితుడైన ఆయన్ను బిహార్ కు చెందిన ఈ తరానికి చెందిన వారిలో చాలావరకు తెలీదు. బిహార్ యువత సైతం ఆయన్ను పెద్దగా గుర్తించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేతగా ఆయనకు పేరుంది. ఆయనకు దేశ అత్యున్నత పౌర సత్కారానికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని చెప్పాలి.
దివంగత నేత కర్పూరి ఠాకూర్ శతజయంతి ఉత్సవాల్ని ఒక రోజు ముందే ఆయనకు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన వేళ.. ఆయన పేరు రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భారతరత్నను ప్రకటించాలన్న డిమాండ్ చేస్తున్న వారికి భిన్నంగా.. ఎవరి నోటిలోనూ పెద్దగా నానని పాతతరం ప్రముఖుడికి ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించటంతో.. ఇంతకూ ఆయన ఎవరు? ఆయన్ను ఎంపిక చేసిన కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సామాజిక మార్పు.. పేద ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం తపించిన నేతగా ఆయనకు పేరుంది. బిహార్ లో ఓబీసీ నేతలు రాజకీయాల్లోకి వచ్చారంటే కారణం.. ఆయనే. ఎందరో తోపు నేతలుగా పేరున్న వారందరికి గురువుగా ఆయన్ను చెబుతారు. బిహార్ లోని సమస్తీపూర్ జిల్లాలో పుట్టిన కర్పూరి ఠాకూర్.. బిహార్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1924 జనవరి 24న ఆయన జన్మదినం. 1970 డిసెంబరునుంచి 1971 జూన్ వరకు తొలిసారి బిహార్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. రెండోసారి 1977 డిసెంబరు నుంచి 1979 ఏప్రిల్ వరకు ఆయన సీఎంగా రెండోసారి వ్యవహరించారు.
అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఆయన.. విద్యార్థి దశ నుంచే పోరాట పంథాను ప్రదర్శించేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. 26 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన గ్రామంలో టీచర్ గా సేవలు అందించి.. అందరిలో చైతన్యం నింపే ప్రయత్నం చేసేవారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ పుర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటమే కాదు.. భారీ మెజార్టీతో గెలిచి విధాన సభలో తొలిసారి అడుగు పెట్టారు.
1960లో పీ అండ్ టీ ఉద్యోగుల కోసం పోరాడి జైలుకెళ్లగా.. 1970లో టెల్కో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 28 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసిన వైనం ఆయన సొంతం. తాను నమ్మిన సిద్దాంతాల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే ఆయన.. బిహార్ కు మంత్రిగా ఉన్నవేళ..మెట్రిక్యులేషన్ లో ఇంగ్లిషు తప్పనిసరి అన్న నిర్ణయాన్ని పక్కన పెట్టి.. పరీక్షల జాబితాలో నుంచి దాన్ని తీసేశారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయటంతో పాటు.. వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు.
ఎంతోమంది రాజకీయ నేతలకు ఆయన గురువుగా పేరుంది. జయప్రకాశ్ నారాయణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఠాకూర్ తర్వాతి కాలంలో జనతాపార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అధిక్యం ఉండే బిహార్ లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది యువత ఉద్యమంలోకి వచ్చారు. అలా వచ్చిన వారు తర్వాతి కాలంలో పెద్ద పెద్ద నేతలుగా ఆవతరించారు.
లాలూ ప్రసాద్ యాదవ్.. నితీశ్ కుమార్..రాం విలాస్ పాశ్వాన్ లాంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు కావటం గమనార్హం. బిహార్ లో ఓబీసీలతో పాటు ఎంబీసీలు కూడా ఎదగాలని భావించిన ఆయన.. దళితులు.. ఎంబీసీలు.. ముస్లింల హితం కోసం పని చేసేవారు. తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి సుదీర్ఘ కాలం బిహార్ తో పాటు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన సత్తా ఆయన సొంతం.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఆయన రాజకీయ సిద్దాంతాలు తొలుత గాంధీ ఆలోచనల్ని ప్రభావితం చేయగా.. తర్వాతి కాలంలో ఆయనతోనే సైద్ధాంతికంగా విభేదించారు. రామ్ మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. దేశంలో భూస్వాముల వద్ద.. ప్రభుత్వ అధీనంలోని భూముల్ని పేదలకు పంచాలని.. తద్వారా సామాజిక.. ఆర్థిక సమానత్వం సాధిస్తుందని బలంగా నమ్మేవారు. ఇలా చేయటం ద్వారా దేశం పురోగమిస్తుందని భావించేవారు. అందుకే ఆయన్ను జననాయక్ కర్పూరి ఠాకూర్ గా పిలిచేవారు. 1988 ఫిబ్రవరి 17న ఆయన తుదిశ్వాస విడిచారు.