రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్…హిందుత్వ భావాలు నిండుగా ఉన్న ఈ సంస్థ గురించి దేశంలో చాలామందికి భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరేమో దీన్ని మతతత్వ సంస్థగా ముద్ర వేస్తే…మరికొందరు ఆర్ఎస్ఎస్ ను కచ్చితమైన నియమనిబంధనలు గల సంస్థగా పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి.
ప్రజలు తప్పుడు ఆహారం తీసుకోరాదని, హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని భగవత్ సూచించారు. భారత్ వికాస్ మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భగవత్…మాంసాహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వ వికాస అంశంపై మాట్లాడిన భగవత్…తప్పుడు ఆహారాన్ని తీసుకునేవారిని ఆ ఆహారం తప్పుడు మార్గంలోకి నడిపిస్తుందని చెప్పారు. తామసంతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదంటూ మాంసాహారంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
హింసతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోరాదని భగవత్ సూచించారు. ప్రపంచంలో చాలామంది మాదిరే భారత్ లోనూ మాంసాహారులున్నారని, కానీ, భారతదేశంలో మాంసాహారులు తమను కొంత నియంత్రించుకోగలరని అన్నారు. కొన్ని నియమాలను భారతీయ మాంసాహారులు పాటిస్తుంటారని, శ్రావణ మాసం, సోమవారం, మంగళవారం, గురు లేదా శనివారాలు చాలామంది మాంసాహారులు మాంసం ముట్టరని చెప్పారు. మాంసాహారం తామసం కిందకే వస్తుంది. దీంతో, మాంసం తినేవారంతా చెడ్డవారనేలా భగవత్ వ్యాఖ్యలున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.