బెజవాడ రాజకీయాలు చాలా డిఫరెంట్. ఇక్కడ ఏ పార్టీలో ఎంత మంది నాయకులు ఉన్నా.. కొత్త పార్టీలకు, కొత్త నేతలకు ఇక్కడి ప్రజలు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. కొంత జోష్ చూపిస్తే.. చాలు.. యువ కెరటాలు ఎగిసి పడుతూనే ఉంటాయి. అయితే.. దీనిని అందిపుచ్చుకుంటున్న పరిస్థితి ప్రధాన పార్టీ అయిన జనసేనలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోతిన వెంకట మహేష్, బత్తిన రాములు బెజవాడలోని రెండు కీలక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రాము తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మరో నియోజకవర్గం సెంట్రల్‌ను పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఇచ్చేశారు. దానిని పక్కన పెడితే.. ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పుంజుకునేందుకు, గెలిచేందుకు కూడా మంచి మార్జిన్ ఉంది.
2009లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి పవన్ అన్నయ్య.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. అప్పట్లో తూర్పు నుంచి యలమంచిలి రవి, పశ్చిమ నుంచి వెలంపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు. అంటే.. దీనిని బట్టి మెగా ఫ్యామిలీకి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ యువత బ్రహ్మరథం పడుతున్నట్టు అర్ధమవుతోంది. అయితే.. గత ఏడాది ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన మహేష్, రాములు తొలిసారి ఎన్నికల్లోకి వచ్చినా.. ఆశించిన ఓట్లే దక్కించుకున్నారు.
మహేష్‌కు 33 వేల పైచిలుకు ఓట్లు లభించగా, రామకు 23 వేల ఓట్లు వచ్చాయి. దీనికి ప్రధానంగా జగన్ సునామీతోపాటు కొన్ని రాజకీయ పరిస్థితులు ప్రభావితమయ్యాయి. అయితే.. పరిస్థితి ఎప్పుడూ అలానే ఉండి పోదు కనుక.. ఈ ఇద్దరు నాయకులు కొంత మేరకు కృషి చేస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, వీరు మాత్రం ఎక్కడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. వీరు ఎందుకిలా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా పుంజుకుంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కడం ఖాయమనే సూచనలు వినిపించుకుంటారో లేదో చూడాలి.