సుప్రీం కోర్టు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు న్యాయ వ్యవస్థపై ఏపీ సీఎం జగన్ పలు అనుమానాలు వ్యక్తం చేసిన వైనం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో న్యాయవాదులంతా జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు పక్షపాతం, కులం ఆపాదించడంపై మండిపడ్డారు. అయితే, ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.
ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాపై కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో చందాకు సంబంధాలున్నాయని దీదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీకి హైకోర్టు షాకిచ్చింది. న్యాయవ్యవస్థను చెడుగా చిత్రీకరించినందుకుగాను దీదీకి రూ.5లక్షల జరిమానా విధించింది.
నందిగ్రామ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిదందే. సువేందు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కోల్ కతా హైకోర్టులో దీదీ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారణ చేస్తున్న జస్టిస్ కౌశిక్ చందా….ఈ పిటిషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా లేదో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఈ క్రమంలోనే మమతా ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ చందాను తన కేసు విచారణ నుంచి తప్పించాలని, ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే న్యాయవ్యవస్థను చెడుగా చిత్రీకరించారన్న ఆరోపణలతో దీదీకి రూ.5లక్షల ఫైన్ వేసింది కోల్ కతా హైకోర్టు. మరి, ఇదే తరహాలో జగన్ కూడా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని, జగన్ కు ఫైన్ వేయాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.