బెజవాడలో బరితెగింపు ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆడపిల్లల రక్షణ కోసం.. వారి మీద ఈగ వాలినా ఊరుకోమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం తీసుకురావటం తెలిసిందే. అలాంటి రాష్ట్రంలో ప్రేమోన్మాది ఆరాచకం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించాలంటూ పశువులా వెంటపడినోడిని కాదన్నదే ఆమె చేసిన పాపం. అంతే.. ఇంటికెళ్లి మరీ కత్తితో దాడి చేసి చంపేసిన వైనం విజయవాడలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడిన యువతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రీస్తురాజుపురంలోని కార్పెంటర్ గా పని చేసే నాగేంద్రబాబు.. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న నాగేంద్రబాబు.. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె మెడ మీద కత్తితో తీవ్రంగా గాయపర్చారు. జరిగిన పరిణామంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆమె కుప్పకూలిపోయారు. రక్తం మడుగులో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాను ప్రేమించమని కోరినా ఒప్పుకోని యువతిపై విచక్షణరహితంగా దాడి చేసిన నాగేంద్రబాబు.. అనంతరం తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేయిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇంటికి వెళ్లిమరీ దాడికి పాల్పడిన వైనంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
యువతి మరణానికి కారణమైన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని.. అప్పుడే ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉంటాయని వారు డిమాండ్ చేస్తున్నారు. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.