బీబీసీ.. ఇప్పుడు ఈ మూడు అక్షరాలు.. దేశాన్ని కుదిపేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నసమయంలో జరిగిన గోద్రా దుర్ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఎవరి ప్రమేయం ఉంది? అనేకీలక విషయాలతో ఇటీవల బీబీసీ ఒక డాక్యమెంటరీని ప్రసారం చేసింది. అయితే.. దీనిని కేంద్రప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు.. నిముషాల వ్యవధిలోనే సోషల్ మీడియా సహా యూట్యూబ్ నుంచి దీనిని తొలగించాలని.. కూడా ఆదేశించింది. అదేసమయంలో ఈ డాక్యుమెంటరీని చూడడాన్ని కూడా మౌఖికంగా నిషేధించింది.
ఈ డాక్యుమెంటరీని చూశారన్న కారణంగా.. అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు కూడా వేసి.. వారిపై కేసులు కూడా నమోదు చేసింది. అయితే.. అసలు భారత దేశంలో బీబీసీ ప్రసారాలనే నిలిపివేయాలని కోరుతూ.. హిందూసేన దాఖలు చేసిన పిటిషన్ మరింతగా సంచలనం సృష్టించింది. దీనిని విచారణ కు స్వీకరించిన సుప్రీంకోర్టు.. బీబీసీకి లైన్ క్లియర్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. బీబీసీను భారత్లో బ్యాన్ చేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిట్ పిల్లో మెరిట్ లేనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
బీబీసీ వార్తాసంస్థను భారత్లో నిషేధించాలని కోరుతూ.. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తాతోపాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. భారత్, ప్రధాని మోడీ ఎదుగుదలను చూసి ఒర్వలేక కుట్రపూరితంగా బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లో మెరిట్ లేనందున కొట్టివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ పాత్రను బీబీసీ మీడియా సంస్థ విమర్శనాత్మకంగా చూపించింది. ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ పేరుతో రెండు ఎపిసోడ్ల సిరీస్ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించింది. అయితే.. దీనిపై మాత్రం సుప్రీం కోర్టు ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది.