నా పేరు ప్రసన్న. నేను కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉంటున్నాను. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను. నాకు డ్యాన్స్, సంగీతం, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ రంగం మీద ఉన్న ఇష్టంతో నేను చాలా ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాను. సోషల్ మీడియాలో మోడల్ గా నాకున్న ఫాలోయింగ్ ను ఉపయోగించుకొని రకరకాల ఉత్పత్తులు, బ్రాండ్ల తరఫున ప్రచారం చేస్తుంటాను.
నాకు డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో డీజే నైట్స్ లో పాల్గొని రాత్రంతా డ్యాన్స్ చేస్తుంటాను. చాలాకాలంగా డీజే నైట్స్ లో డ్యాన్స్ చేస్తున్న నేను అక్కడ కేవలం బాలీవుడ్ నైట్స్ మాత్రమే ఉండడాన్ని గమనించాను. డీజే నైట్స్ లో ఒక్క దక్షిణాది సినిమాలోని పాటకు కూడా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ఆ విషయం నన్ను ఆలోచింపజేసింది. అందుకే, నేను సొంతగా ‘Inni Entertainments’ ఈవెంట్ కంపెనీని ప్రారంభించాను. మా కంపెనీ ఏర్పాటు చేసే డీజే నైట్స్ లో దక్షిణ భారత సంగీతం, పాటలపై ఎక్కువగా దృష్టి సారించాం. వాటితోపాటు కొన్ని బాలీవుడ్ పాటలను కూడా ప్లే చేసేవాళ్లం. కంపెనీ ప్రారంభించిన చాలాకాలం తర్వాత నాకు సన్నివేల్ లో వెన్యూ దొరికింది.
అయితే, కంపెనీ పెట్టిన కొత్తలో ఎంతమంది దక్షిణ భారతీయులకు ఈ తరహా డీజే నైట్స్ పై ఆసక్తి ఉంటుందా అన్న సందిగ్ధం ఉండేది. కానీ, నా అనుమానాలకు పటాపంచలు చేస్తూ సెప్టెంబరు 24న ఏర్పాటు చేసిన నా తొలి ఈవెంట్ “పక్కా లోకల్” విజయవంతమైంది. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒక ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే అక్టోబర్ 29న ”కాశ్మోరా కాలింగ్” పేరుతో చేసిన రెండో ఈవెంట్ కూడా ఘన విజయం సాధించింది. నవంబరు 19న ఏర్పాటు చేసిన నా మూడో ఈవెంట్ ”లక్ష్మీ బాంబ్”, డిసెంబరు 10న ఏర్పాటు చేసిన నాల్గో ఈవెంట్ ”బుల్లెట్ బండి”కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇవన్నీ పబ్లిక్ ఈవెంట్స్. కాబట్టి ఆసక్తి ఉన్నవారు టికెట్ కొనుక్కొని ఈవెంట్ ను చూడవచ్చు. అయితే, బే ఏరియాలో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా దక్షిణ భారతీయులందరికీ నా ఈవెంట్ గురించి తెలిసేలా నా స్నేహితుల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను.
నేను డబ్బు సంపాదించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ ఈవెంట్ కంపెనీని ప్రారంభించలేదు. దక్షిణాది సినిమాలలోని పాటలు, తెలంగాణ పాటలకు డ్యాన్స్ చేయాలనుకునేవారికి 4 గంటల పాటు వినోదం ఓ సరైన వేదికను కల్పించడమే నా ఈవెంట్ కంపెనీ ప్రధాన ఉద్దేశ్యం. ఎవరేమనుకున్నా సరే…మనం నమ్మిన, మనకు సరైనది అనిపించిన పనిని చేయాలి…అలా చేస్తే ఆ పనిలో తప్పక విజయం సాధిస్తాం…అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. నాకు, నా కుటుంబానికి, నా ఈవెంట్ కంపెనీకి అండగా ఉంటూ మద్దతు తెలుపుతున్న స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.