వీలున్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిషేధం అన్నమాట మరిచిపోవాలి. మద్య నిషేధం, మద్య పాన నిషేధం ఈ రెండూ కూడా కోరుకోకుండా ఉండాలి. కానీ సరిహద్దు గ్రామాలు మాత్రం నిత్యం మత్తులో జోగుతున్నా ఒక్కటంటే ఒక్క కల్తీ సారా కేసు పట్టుబడదు. పోలీసులకు చిక్కదు. ఇదే ఇప్పుడు ఏపీ లో పలు విమర్శలకు తావిస్తున్నది. తాజాగా బార్ల లైసెన్సులకు సంబంధించిన వివాదం ఒకటి నడుస్తున్నది. మొత్తం ఎనిమిది వందలకు పైగా బార్లకు లైసెన్సులు ఇచ్చి, తద్వారా ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఆర్జించింది.
వీటి లైసెన్సుల గడువు ఆగస్టు 2025 వరకూ ఉండనుంది. అంటే కొత్త ప్రభుత్వ హయాంలో కూడా మద్య నిషేధం అన్నది సాధ్యం కాని పని అని తేలిపోయింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఇలాకాలో కొందరు వ్యాపారుల తీరు కారణంగా ప్రభుత్వానికి వేలం ప్రక్రియలో రెండోరోజు (ఆదివారం, జూలై 31) కాస్త కూడా కలిసి రాలేదు అని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23 బార్లకు లైసెన్సులన్నవి జారీ కాకుండా మిగిలిపోయాయి.
మొత్తం 815 బార్లకు గాను ప్రభుత్వానికి 597.35 కోట్ల రూపాయల మేర ఆదాయం దక్కింది. తొలిరోజు శనివారం నిర్వహించిన వేలంలో 258 కోట్ల రూపాయలు రాగా, మరుసటి రోజు అంటే ఆదివారం నిర్వహించిన వేలం ప్రక్రియలో339 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభించింది. మొత్తంగా ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.
(దరఖాస్తుల రుసుంతో కలుపుకుని…ఇదంతా నాన్ రిఫండబుల్ ఫండ్ అంటే ఈ రుసుమును వెనక్కు తిరిగి చెల్లించరు. జనాభా ప్రాతిపదికన చేసుకుని దరఖాస్తు రుసుము నిర్ణయించారు. 50 వేలు లోపు జనాభా ఉంటే ఐదు లక్షల రూపాయలు, యాభై వేలు నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉంటే ఏడున్నర లక్షల రూపాయలు, 5 లక్షల జనాభాదాటి ఉంటే పదిలక్షల రూపాయలు ఎక్సైజ్ శాఖకు చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించారు.)
ఏ విధంగా చూసుకున్నా గతం కన్నా ఇప్పుడు వైసీపీ నాయకులు కాస్తో కూస్తో డబ్బులు సంపాదించుకునే వీలొకటి బార్ల ద్వారా కలిగిందని, ఓ విధంగా నాయకుల అసంతృప్తిని ఈ విధంగా ముఖ్యమంత్రి తగ్గించగలిగారు అని విపక్షాలన్నీ ఎత్తిపొడుతస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకూ ఇదే విధంగా ఏదో విధంగా తమవారికి సంతృప్త పరుస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుకు ఏవో ఒక చర్యలు తీసుకుని తద్వారా ఖజానాను నింపిన దాఖలాలు మున్ముందూ ఉంటాయి అని విపక్షాలు అంటున్నాయి.
ఆ రోజు తాగుడు కారణంగా మానవ సంబంధాలు ఛిద్రం అయిపోతున్నాయని ఆవేదన చెందిన సీఎం ఇవాళ అవే కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారని మండిపడుతున్నాయి. కేవలం ఆదాయార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలను ముఖ్యంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ పేద, మధ్య తరగతి వర్గాల జీవితాలను ఛిద్రం చేస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి.