మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), హర్ష వర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)లను పార్టీ మారాలని కొందరు ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
మొయినాబాద్ లో ఓ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలతో డీల్ మాట్లాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని వెల్లడించారు.
పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్ లో తమను కలిశారని ఆరోపించారు. డబ్బుతో పాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించినట్టు ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోనే ఆ ముగ్గురూ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరిగిందని, కేసీఆర్ ఢిల్లీ టూర్ లో దీనిని రాశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు. ఈ డ్రామాతో తమకు సంబంధం లేదని యాదాద్రిలో ప్రమాణం చేసే దమ్ము ఉందా? అని కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు.యాదాద్రికి తమ తరపున ఎవరిని కోరితే వారే వస్తారని, టైం, తేదీ చెప్పాలని అన్నారు.
మంత్రిపై హత్యాయత్నం డ్రామాలు ఫెయిల్ కావడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరతీశారని అన్నారు. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో నాలుగు రోజుల సీసీటీవీ ఫుటేజీలతోపాటు ప్రగతి భవన్‌లోని ఫుటేజీలు బయటపెడితే సీఎం ఆడుతున్న డ్రామా బయటపడుతుందని అన్నారు.