ఇంట రచ్చ వీధికెక్కినట్టు వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న ఆస్తుల వివాదం టాక్ ఆఫ్ ది ఏపీ గా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్తుల కోసం యుద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు లేఖలు, మరోవైపు విమర్శలు సంధించుకోవడమే కాకుండా.. మధ్యలోకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను కూడా లాగి నానా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందిస్తూ.. జగన్, షర్మిలపై చురకలు వేశారు.
40 ఏళ్ళ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారని.. కానీ ఇప్పుడు జగన్, షర్మిల ఆయన పరువు బజారుకీడ్చారని బాలినేని అన్నారు. మీ ఇంట మీరే రచ్చ చేసుకుని మధ్యలోకి చంద్రబాబును లాగుతున్నారు. అసలు చంద్రబాబుకు, జనసేనకు ఏమి సంబంధం? అని బాలినేని ప్రశ్నించారు. చంద్రబాబే కుట్ర చేసి వైఎస్‌ను చంపించారన్న ఆరోపణలు చేస్తున్నారు. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ తన తండ్రి మరణం వెనుక ఉన్న కుట్రను ఎందుకు బయటపెట్టలేదు? వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు అంటూ బాలినేని పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు రాజకీయ భిక్ష పెట్టారు. వైఎస్ విజయమ్మ వల్లే వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడ్డాము. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల మధ్య ఏం జరిగిందో విజయమ్మకు పూర్తిగా తెలుసు. ఆవిడే తొందరగా గొడవను పరిష్కరిస్తుందని భావిస్తున్నానని.. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని బాలనేని వ్యాఖ్యానించారు.
ఇక తాను ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొందరు వైసీపీ నేతులు ప్రచారం చేస్తున్నారు.. అందులో ఏ మాత్రం నిజం లేదని బాలినేని అన్నారు. వైసీపీలో నేను ఒక్క రూపాయి సంపాదించలేదు. నా ఆస్తులు, నా తండ్రి ఆస్తులు, నా కోడలు ఆస్తులు అమ్మి వైసీపీలో పెట్టాను. అందుకు జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యమని బాలినేని చెప్పుకొచ్చారు.