ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విచిత్రమైన పరిస్ధితులు రాజ్యమేలుతున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ డమ్మీని చేసేశారా అనే ప్రచారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం మున్సిపాలిటి పరిధిలో మంత్రి బాలినేని మాట చెల్లుబాటుకన్నా కరణం హవానే నడుస్తోంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బాలినేని వైసీపీ ఎంఎల్ఏ గా మంత్రివర్గంలో కంటిన్యు అవుతుంటే ఎంఎల్ఏ కరణం అసలు వైసీపీ ఎంఎల్ఏనే కాకపోవటం.
కరణం వ్యవహారశైలి మొదటినుండి ఇలాగే ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నా తన మాటే చెల్లుబాటవ్వాలనే పంతంతో ఉంటారు. ప్రత్యర్ధులపై దూకుడు స్వభావంతోనే ఉంటారు. దాంతో కరణం ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతునే ఉంటాయనే విషయం అందరికీ అర్ధమైపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చీరాలలో గెలిచి అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఈమధ్యనే తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను వైసీపీలో చేర్పించారు. అయితే వ్యూహాత్మకంగా తాను మాత్రం ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకోలేదు.
ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనవర్గం తరపున 18 మందిని కరణం గెలిపించుకున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంఎల్ఏ, కరణం ప్రత్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారుల్లో 11 మంది గెలిచారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కరణం, ఆమంచి మధ్య ఆధిపత్యం పోరాటం చాలా తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే తమ మద్దతుదారులను కౌన్సిలర్లుగా పోటీచేయించేందుకు ఇద్దరు ప్రయత్నించారు.
అయితే పార్టీ కరణానికే విలువిచ్చి బీఫారాలు ఇచ్చింది. దాంతో ఆమంచి వర్గం స్వతంత్రులుగా పోటీచేశారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆమంచి మద్దతుతో గెలిచిన 11 మంది మంత్రి బాలినేని సమక్షంలో పార్టీ కండువాలు కప్పేసుకుని వైసీపీ కౌన్సిలర్లుగానే కంటిన్యు అవుతున్నారు. ఇపుడు సమస్యేమిటంటే మున్సిపాలిటి పరిధిలో జరుగుతున్న అభివృద్ధిలో తమ వార్డులను విస్మరిస్తున్నారని ఆమంచి వర్గం కౌన్సిలర్లు గోల మొదలుపెట్టారు.
11 మంది ఆమంచి వర్గం కౌన్సిలర్లతో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ జైసన్ బాబు మాట్లాడుతు మంత్రి సమక్షంలో చేరినంత మాత్రాన వైసీపీ కౌన్సిలర్లు అయిపోరన్నారు. కరణం ఆశీస్సులు తీసుకుంటేనే వైసీపీ కౌన్సిలర్లుగా పరిగణించి అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రకటించారు. దాంతో 11 మంది కౌన్సిలర్లు షాక్ తిన్నారు. నిజానికి కరణమే వైసీపీ ఎంఎల్ఏకాదు. అలాంటిది మంత్రి సమక్షంలో చేరిన ఆమంచి వర్గం కౌన్సిలర్లను వైసీపీ కౌన్సిలర్లుగా గుర్తించేది లేదని వైస్ ఛైర్మన్ ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే కరణం ముందు మంత్రి బాలినేని డమ్మీ అయిపోయారా అనే సందేహం పెరిగిపోతోంది.