అనేక చర్చలు.. అనేక సర్వేలు.. ఎంతో మంది ఆశావహులను పరిశీలించిన జనసేన ఎట్టకేలకు.. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు సీటును ప్రకటించింది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలశైరికి వెంటనే ఈ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది.
అందరూ ఇదే అనుకున్నారు. ఎందుకంటే.. తాను ఇక్కడ తప్ప మరెక్కడా పోటీ చేసేది లేదని బాల శౌరి ప్రకటించారు. ఎక్కడైనా పోటీ చేయాలని అనుకుంటే.. అసలు వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. ఆయనను మచిలీపట్నం కాకుండా.. రాష్ట్రంలోని 22 స్తానాల్లో (రాజం పేట, కడప, మచిలీపట్నం కాకుండా) ఏదైనా ఒకటి ఎంచుకోవాలని వైసీపీ సూచించింది. అయితే.. ఆయన దీనికి ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే పార్టీని వదిలేశారు.
ఆ వెంటనే బాలశౌరి.. నేరుగా జనసేనలోకి చేరిపోయారు. క్యాస్ట్ ఈక్వేషన్ కూడా కుదరడంతో బాలశౌరిని వెంటనే చేర్చుకున్న పవన్ కళ్యాణ్.. మచిలీపట్నం టికెట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇంతలోనే ఈ సీటుకు వేరే వారిని చూస్తున్నారని.. వ్యాపార వేత్త పేరు పరిశీలనలో ఉందని చాలా రోజులు చర్చలు జరిగాయి. అదే సమయంలో సుజనా చౌదరిని కూడా ఇక్కడ నిలబెడుతున్నారని జనసేనలోనే ఓ వార్త హల్చల్ చేసింది. దీంతో బాలశౌరి వేచి చూశారు.
ఇక, ఎట్టకేలకు.. మచిలీపట్నం నుంచి బాలశౌరి పేరును ఖరారు చేస్తూ.. జనసేన తాజాగా ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా జనసేన మొత్తం రెండు పార్లమెంటుస్థానాలు తీసుకుంది. వీటిలో కాకినాడ మరొకటి. ఇక్కడ నుంచి టీ-టైమ్ వ్యాపార వేత్త, వారాహి వాహనం కానుక గా ఇచ్చిన తంగెళ్ల శ్రీనివాస్‌ను ప్రకటించారు. ఇక, జనసేన తీసుకున్న అసెంబ్లీ స్తానాల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. ఈ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆశావహులు అధికంగా ఉండటంతో అక్కడ సర్వే చేస్తున్నామని, సర్వే రిపోర్టు ఆధారంగా అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొనడం గమనార్హం.