గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ‘క్రాక్’. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం గురించి విడుదలకు ముందు ఒక రూమర్ బాగా హల్చల్ చేసింది. తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’కి ఇది రీమేక్ అన్నదే ఆ రూమర్. ‘క్రాక్’ టీజర్ చూస్తే అందులో హీరో పాత్ర.. కొన్ని షాట్లు ‘సేతుపతి’ని గుర్తుకు తెచ్చాయి.
ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా రీమేక్ కాదని స్పష్టమైంది. అలాగని ‘సేతుపతి’కి దీనికి సంబంధం లేదని కూడా చెప్పలేం. హీరో పాత్రను దాన్నుంచే ఇన్స్పైర్ అయి తీర్చిదిద్దినట్లు.. అలాగే కొన్ని సన్నివేశాల విషయంలోనూ స్ఫూర్తి పొందినట్లు స్పష్టమైంది. ఐతే ‘సేతుపతి’ టీం అనుమతితోనే గోపీచంద్ ఇలా చేశాడా లేదా అన్నది తెలియదు.
మొత్తానికి ఈ ఫార్ములా అయితే బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమా విషయంలోనూ గోపీచంద్ ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.
గోపీచంద్‌తో బాలయ్య సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఐతే షూటింగ్ ఆరంభమైన తొలి రోజే షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో లీకైంది. ఇందులో బాలయ్య లుంగీ కట్టుకుని ఆరుబయట కుర్చీలో కూర్చుని ఉన్నాడు. గడ్డంతో బాలయ్య లుక్ కొత్తగా అనిపిస్తోంది. ఈ ఫొటో ఇలా బయటికి వచ్చిందో లేదో.. ఇది ‘ముఫ్తి’ అనే కన్నడ సినిమాకు ఇది రీమేక్ అనే ప్రచారం ఊపందుకుంది.
2017లో విడుదలైన ఆ చిత్రంలో హీరో శివరాజ్ కుమార్ ఇలాంటి లుక్‌తో, కుర్చీలో కూర్చున్న ఫొటోలు నెట్లో కనిపిస్తున్నాయి. దీంతో బాలయ్య కన్నడ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడనే చర్చ ఊపందుకుంది. ఈ చిత్రంలో కన్నడ నటుడే అయిన దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
కన్నడలో ముఫ్తి సినిమా ఘనవిజయం సాధించింది. ఐతే ఈ సినిమా రీమేక్ అయితే ముందే ప్రకటించి ఉండేవారు. పైగా బాలయ్య రీమేక్‌ల పట్ల అంతగా ఆసక్తి చూపించరు. ‘లక్ష్మీ నరసింహ’ తర్వాత ఆయన రీమేక్‌లే చేయలేదు. కాబట్టి ‘క్రాక్’ తరహాలోనే హీరో పాత్ర, కొన్ని సన్నివేశాల వరకు ‘ముఫ్తి’ నుంచి గోపీచంద్ ఇన్స్పైర్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాగైతేనేం ‘క్రాక్’ తరహాలోనే మంచి మాస్ సినిమాను అందిస్తే బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.