తెలుగు సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు. గతంలో పద్మభూషణ్ అయిన ఆయన.. గత ఏడాది పద్మవిభూషణ్గా ఎంపిక అయ్యారు. ఇప్పుడు బాలయ్య సమకాలీనుడైన నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్గా చూడబోతున్నామనే చర్చ నడుస్తోంది. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేయబోతున్నట్లు, చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు ఇది జస్ట్ రూమర్ అంటుండగా.. కొందరేమో నిజమనే అంటున్నారు. బాలయ్యకు ఇప్పటిదాకా పద్మ పురస్కారం ఏదీ రాలేదు. ఇంకా పద్మశ్రీ కూడా అందుకోని ఆయన్ని నేరుగా పద్మభూషణ్ లాంటి పెద్ద పురస్కారానికి ప్రభుత్వం సిఫారసు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారు టీడీపీ, జనసేన పార్టీల మీద ఆధారపడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం అడిగినా ఇచ్చే పరిస్థితుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్లో ఏపీకి మంచి ప్రాధాన్యం దక్కింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15 వేల కోట్ల అప్పు కూడా తెచ్చిస్తోంది కేంద్రం. ఇంకా బాబు డిమాండ్లు చాలా వాటిని ఒప్పుకుంటోంది.
ఈ నేపథ్యంలో బాలయ్యకు పద్మభూషణ్ కోరినా కాదనకపోవచ్చు. కానీ బాలయ్యకు ఈ పురస్కారం దక్కితే టీడీపీ కేంద్రంలో భాగస్వామి కాబట్టి అవార్డు ఇప్పించుకుందనే పేరు కూడా రావచ్చు. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ఆయన ఈ పురస్కారానికి అర్హుడే అంటున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడమే కాక.. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడని.. ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని.. కాబట్టి ఆయనకు పద్మభూషణ్ ఇస్తే తప్పేమీ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.