తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అవకాశం వచ్చినపుడల్లా ఎంత దారుణంగా తిడతాడో తెలిసిందే. ఈ మధ్య నందమూరి బాలకృష్ణను కూడా ఆయన వదలట్లేదు. ఇటీవలే బాలయ్య గురించి తీసి పడేసేలా మాట్లాడాడు నాని. ఆయన విగ్గు గురించి కూడా నాని కామెంట్ చేశాడు. ఈ కామెంట్లపై ఇప్పుడు బాలయ్య పరోక్షంగా కౌంటర్లు విసిరాడు.
భగవంత్ కేసరి ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ”ఒకప్పటి రోజుల్లో కారవాన్లు ఉండేవి కావని, ఆరు బయట చెట్ల కింద చాపేసి పడుకునేవాళ్లమని.. తాను విగ్గు తీసి పక్కన పెట్టి పడుకునేవాడినని బాలయ్య అన్నాడు. విగ్గు ప్రస్తావన రాగానే బాలయ్య.. మొన్న ఎవడో అన్నాడు.. నేను విగ్గు పెట్టుకుంటాను అని. అవునయ్యా విగ్గు పెట్టుకుంటాను, నువ్వేం పీక్కుందామని గడ్డం పెట్టుకుంటావు అని అడిగా. ఓపెన్ బుక్ మనదంతా. భయపడేదే లేదు. వాడికి చెప్తున్నా మళ్లీ. ఇంకోసారి వాగాడంటే..” అంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చాడు. నాని పేరు ఎత్తకపోయినా.. ఆయన మాటల్ని బట్టి ఇలా వార్నింగ్ ఇచ్చింది నానికే అని అందరికీ అర్థమైపోయింది.
ఈ వీడియో పెట్టి నానికి టీడీపీ వాళ్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తనకు ఎవరూ పోటీ లేరని బాలయ్య పేర్కొనడం విశేషం. ఏ రంగంలో అయినా పోటీ ఉంటేనే బాగుంటుందని.. కానీ తనకు ఎవరూ పోటీ లేరని, తనకు తానే పోటీ అని.. తాను ఎవరినీ పట్టించుకోనని బాలయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక భగవంత్ కేసరి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంటుందని.. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని బాలయ్య వ్యాఖ్యానించాడు.